తెల్లకోటుకు కోట్లు అక్కర్లేదు! | medical education expenses will come down with NEET | Sakshi
Sakshi News home page

తెల్లకోటుకు కోట్లు అక్కర్లేదు!

Published Mon, May 16 2016 2:56 AM | Last Updated on Sat, Oct 20 2018 5:44 PM

తెల్లకోటుకు కోట్లు అక్కర్లేదు! - Sakshi

తెల్లకోటుకు కోట్లు అక్కర్లేదు!

- నేలకు దిగనున్న డాక్టర్ చదువుల ఖర్చులు
- ప్రతిభకు పట్టం కట్టనున్న నీట్
- మెరుగైన ర్యాంక్ వస్తే ఏదో ఒక కేటగిరీలో సీటు గ్యారంటీ
- ప్రైవేట్ యాజమాన్యాల అడ్డగోలు దోపిడీకి చెక్ పెట్టిన సుప్రీం తీర్పు
- ర్యాంకుల ప్రకారమే ఎంబీబీఎస్, బీడీఎస్‌ల్లో బీ, సీ కేటగిరీ అడ్మిషన్లు
- ఎంబీబీఎస్‌లో బీ కేటగిరీకి ఏడాదికి 9 లక్షలు.. సీ కేటగిరీకి 11 లక్షలు
- ఇవే సీట్లను గతంలో కోట్ల రూపాయలకు విక్రయించిన యాజమాన్యాలు

 
సాక్షి, హైదరాబాద్

డాక్టర్ చదువంటే ఇప్పటిదాకా కోట్లలో డొనేషన్లు..! ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో వేలం మాదిరి సీట్ల అమ్మకాలు..! ప్రతిభ ఉన్నా డబ్బుల్లేక సీటుకు దూరమైన పేద, మధ్య తరగతి విద్యార్థులెందరో..!! ఇకపై వీటన్నింటికీ ‘నీట్’ చెక్ పెట్టబోతోంది. నేషనల్ ఎలిజిబిలిటీ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)లో మెరుగైన ర్యాంక్ తెచ్చుకుంటే చాలు.. ప్రైవేట్ కాలేజీల్లో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు చెల్లించి ఎంబీబీఎస్, బీడీఎస్ చదువుకోవచ్చు. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో సైతం వంద శాతం సీట్లను మెరిట్ ప్రాతిపదికనే భర్తీ చేయాల్సి ఉంటుంది.

ఇప్పటిదాకా ప్రైవేట్ కాలేజీల్లో 50 శాతం సీట్లను మాత్రమే మెరిట్‌లో భర్తీ చేసి మిగిలిన 50 శాతం సీట్లను బీ, సీ కేటగిరీల పేరుతో కాలేజీల యాజమాన్యాలు ఇష్టానుసారంగా అమ్ముకునేవి. రాష్ట్ర ప్రభుత్వాలు ఏ దశలోనూ ఈ అడ్డగోలు వ్యాపారాన్ని నియంత్రించే చర్యలు తీసుకోకపోవడంతో రూ.కోటి అంతకంటే ఎక్కువ చెల్లించడానికి ముందుకొచ్చే వారికే ఆ సీట్లు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు పుణ్యమా అని ప్రైవేట్ యాజమాన్యాల ధనదాహానికి తెరపడింది. ఇక సీటు ఏదైనా సరే.. ఏ కేటగిరీలో భర్తీ చేయాల్సి వచ్చినా సరే.. ‘నీట్’లో విద్యార్థులు సాధించిన ర్యాంక్‌ల ఆధారంగానే కేటాయించాల్సి ఉంటుంది.

సీట్ల భర్తీ మెరిట్ ప్రకారమే..
రాష్ట్రంలో 10 ప్రైవేట్, రెండు మైనారిటీ వైద్య కళాశాలల్లో 1,750 సీట్లున్నాయి. ఇకపై వీటన్నింటినీ మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేయాలి. వీటిలో 1,450 సీట్లు ప్రైవేట్ కాలేజీల్లో ఉండగా.. 300 సీట్లు మైనారిటీ కాలేజీల్లో ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీల్లో ఉన్న 1,450 సీట్లలో గతేడాది దాకా 725 సీట్లు మాత్రమే మెరిట్ కోటాలో అడ్మిషన్ కమిటీ కన్వీనర్ కేటాయించేవారు. మిగిలిన 725 సీట్లు బహిరంగ వేలం ద్వారా.. సీటు కొనే సామర్థ్యాన్ని బట్టి కనిష్టంగా రూ.1 కోటి నుంచి రూ.1.75 కోట్లు దాకా విక్రయించిన దాఖలాలు ఉన్నాయి. బీ కేటగిరీలో 35 శాతం సీట్లకు యాజమాన్యాలే తూతూ మంత్రంగా పరీక్ష నిర్వహించి వారికి కావాల్సిన వారికి సీట్లు కేటాయించుకునేవి.

ఇక సీ కేటగిరీ అయితే ఇష్టారాజ్యం. ఈ కేటగిరీ సీట్ల భర్తీకి యాజామన్యాలు ఏనాడూ నిబంధనలు పాటించలేదు. మామూలుగా అయితే బీ కేటగిరీకి ఎంసెట్ మెరిట్, సీ కేటగిరీకి (ఎన్నారై) ఇంటర్మీడియట్‌లో వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకోవాలి. కానీ కాలేజీ యాజమాన్యాలు వారికి నచ్చిన వారి జాబితాను ప్రభుత్వానికి సమర్పించి ఆమోదం పొందేవి. ప్రభుత్వం ఏ దశలోనూ యాజమాన్యాలను కట్టడి చేసే ప్రయత్నం చేయలేదు. దీంతో ఇప్పటిదాకా వారి వ్యాపారం ‘మూడు సీట్లు ఆరు కోట్లు’గా నడిచింది.

మరి ఇప్పుడు ఎంత చెల్లించాలి...
నీట్ పరీక్షలో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరు ఈ ఏడాది ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు అర్హులు. బీ కేటగిరీలో 35 శాతం అంటే 490 సీట్లకు ప్రభుత్వమే కౌన్సెలింగ్ నిర్వహించాలి. కౌన్సెలింగ్‌కు హాజరైన వారి ర్యాంక్‌ను బట్టి సీటు కేటాయిస్తారు. ఈ సీటుకు ప్రభుత్వం నిర్ణయించిన ఏడాదికి రూ.9 లక్షల ఫీజు మాత్రమే చెల్లించాలి. గతంలో మాదిరి ఇప్పుడు అదనంగా ఒక్క పైసా చెల్లించాల్సిన పని లేదు. కాస్త మెరుగైన ర్యాంక్ తెచ్చుకుంటే ఐదున్నరేళ్ల ఎంబీబీఎస్ కోర్సును రూ.45 లక్షలతో పూర్తి చేయవచ్చు.

గతంలో అయితే ఈ ఫీజుకు అదనంగా రూ.75 లక్షల నుంచి రూ.కోటి దాకా వసూలు చేసేవారు. ఇక ఎన్నారై కోటాలో 235 సీట్లను కూడా నీట్ ద్వారానే భర్తీ చేయాలి. ఇందుకు కాలేజీలు ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించాలి. వచ్చిన దరఖాస్తుల్లో వారి ర్యాంక్‌లను బట్టి సీట్లు కేటాయించాలి. ఈ సీటుకు ప్రభుత్వం నిర్దేశించి రూ.11 లక్షలు మాత్రమే చెల్లించాలి. ఈ కోటాలో చేరిన విద్యార్థి ఐదున్నరేళ్ల ఎంబీబీఎస్ కోర్సును రూ.55 లక్షలతో పూర్తి చేయవచ్చు. ఇప్పటిదాకా ఈ సీటుకు రూ.55 లక్షలకు అదనంగా రూ.కోటి నుంచి కోటిన్నర దాకా వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి.

ఉల్లంఘిస్తే ఏం చేస్తారు?
ఏ ప్రైవేట్ యాజమాన్యమైనా నిబంధనలు ఉల్లంఘిస్తే అన్యాయానికి గురైన విద్యార్థి నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చు. ఏ కాలేజీ అయినా సీట్లు భర్తీ చేసుకోవడానికి నోటిఫికేషన్ ఇవ్వకపోతే భర్తీ చేసుకునే సీట్లు చెల్లుబాటు కావు. ఎన్నారై కోటా సీట్లు భర్తీ చేయడానికి కాలేజీలు రెండు ప్రముఖ దినపత్రికల్లో ప్రకటనలు జారీ చేయాల్సి ఉంటుంది. ఆ వివరాలను ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్‌తోపాటు వైద్య విద్య సంచాలకులకు తెలియజేయాలి. ఎన్నారై కోటా సీట్ల కోసం వచ్చిన దరఖాస్తుదారుల వివరాలతోపాటు వారికి వచ్చిన ర్యాంక్‌లను ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో పెట్టాలి. విద్యార్థి తనకు సీటు వస్తుందో రాదో కచ్చితంగా తెలుసుకునేలా పారదర్శకత పాటించాలి. ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘించి అనర్హులకు సీట్లు కట్టబెడితే భారతీయ వైద్య మండలి నిబంధనల ప్రకారం ఆ కాలేజీ గుర్తింపు పోతుంది.

ఎంబీబీఎస్ కోర్సుకు ఇక ప్రైవేట్ వైద్య కాలేజీల్లో ఏడాదికి చెల్లించాల్సిన ఫీజు ఇదీ..
 ఏ    కేటగిరీ            రూ.60,000
 బీ    కేటగిరీ            రూ.9,00,000
 సీ    కేటగిరీ            రూ.11,00,000

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement