మీనాక్షి బ్రహ్మోత్సవం | Meenakshi Brahmotsavam | Sakshi
Sakshi News home page

మీనాక్షి బ్రహ్మోత్సవం

Published Thu, Apr 19 2018 10:04 AM | Last Updated on Thu, Apr 19 2018 10:04 AM

Meenakshi Brahmotsavam - Sakshi

మదురై అంటే.. అందరికీ గుర్తుకొచ్చేది మీనాక్షి అమ్మవారి సన్నిధి. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారుగా ఇక్కడ కొలువుదీరి ఉన్నది సాక్షాత్తు పార్వతీ దేవి అవతారమే. పురాణాల మేరకు మదురై పాలకుడు మలయ ధ్వజ పాండ్య చేసిన ఘోర తపస్సుకు మెచ్చి ఒక చిన్న పాప రూపంలో భూమి మీదకు పార్వతీదేవి అడుగు పెడతారు.

పెరిగి పెద్దయిన ఆమెను వివాహం చేసుకునేందుకు సుందరేశ్వరుడిగా శివుడు ప్రత్యక్షం అవుతాడు. శివ, పార్వతులకు భూమి మీద జరిగిన ఈ వివాహ ఘట్టాన్ని తిలకించేందుకు సమస్తలోకాలు తరలి వచ్చినట్టుగా పురాణాలు చెబుతాయి. ఆ మేరకు ప్రతి ఏటా మీనాక్షి అమ్మవారి సన్నిధిలో చైత్రమాస (చిత్తిరై) ఉత్సవాలు కనులపండువగా నిర్వహిస్తారు.

సాక్షి, చెన్నై: మదురై మీనాక్షి అమ్మవారి సన్నిధిలో చిత్తిరై బ్రహ్మోత్సవ శోభ సంతరించుకుంది. బుధవారం జరిగిన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ ఉత్సవాల్లో ముఖ్య ఘట్టాలు 25న అమ్మవారి పట్టాభిషేకం, 27న వివాహ మహోత్సవం, 29న కళ్లలగర్‌ వైగై నదీ ప్రవేశ సేవలు సాగనున్నాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మదురైలో భద్రతను కట్టుదిట్టం చేశారు. బ్రహ్మోత్సవ శోభ ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ, ఆలయ పాలకమండలి చర్యలు తీసుకుంది.

ఆలయ పరిసరాల్లో బ్రహ్మోత్సవ శోభ సంతరించుకుంది. దక్షిణ తమిళనాడులోని భక్త జనం ఇక, అమ్మవారిని దర్శించి పునీతులయ్యేందుకు మదురై బాట పట్టనున్నారు. ఈ ఉత్సవాలకు శ్రీకారం చుడుతూ ఆలయంలో ఉదయం నుంచి విశిష్ట పూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవారి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సర్వాలంకారాలతో స్వామి, అమ్మవార్లను  ఆలయ మాడ వీధుల్లో ఊరేగించి, ధ్వజ స్తంభం వద్ద అధిష్టింప చేశారు.

ఆలయ శివాచార్యులు విశిష్ట పూజలతో ధ్వజారోహణ కార్యక్రమాన్ని పూర్తిచేశారు. మేళ తాళాలు, శివనామస్మరణ నడుమ బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడుతూ ధ్వజారోహణం నిర్వహించారు. ఉదయం, రాత్రుల్లో అమ్మవారు ప్రత్యేక అలంకరణలతో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. బంగారు వాహనాల్లో మాడ వీధుల్లో తిరుగుతూ భక్తుల్ని కటాక్షిస్తారు. ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలతో పాటు ప్రత్యేక భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తారు. 

కల్యాణ వైభోగమే 

ఈ ఉత్సవాల్లో అత్యంత ముఖ్య ఘట్టాలు నాలుగు. ఇందులో అమ్మ వారి పట్టాభిషేకానంతరం తొలి ముఖ్య ఘట్టం. ఈవేడుక ఈనెల 25న జరగనుంది. 27వ తేదీన భక్త జన సందోహం నడుమ మీనాక్షి అమ్మవారు, సుందరేశ్వర స్వామి వారి వివాహ మహోత్సవం కనుల పండువగా జరుగుతుంది. ఆ మరుసటి రోజున 28వ తేదీన రథోత్సవం వైభవంగా సాగనుంది. ఈ ఉత్సవాల్లోనే అత్యంత ముఖ్య ఘట్టం కళ్లలగర్‌(విష్ణువు) వైగై నదీ ప్రవేశం 29వ తేదీన నిర్వహిస్తారు. మూడో తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కనులపండువలా సాగుతాయి. 

భద్రత కట్టుదిట్టం

మదురై తీవ్ర వాదుల హిట్‌ లిస్ట్‌లో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆలయ పరిసరాల్లో భద్రత నిత్యం పటిష్టంగానే ఉంటుంది. అయితే, బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మదురై జిల్లా యంత్రాంగం భద్రతను మరింతగా పెంచింది. ప్రధాన ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో జనం తరలి వస్తారు కాబట్టి, ఆ రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండేందుకు చర్యలు చేపట్టారు.  

ఇటీవల గోపురం వీధిలోని దుకాణాల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరింత పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. దుకాణాలదారులకు తీవ్ర హెచ్చరికలు జారీచేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement