Meenakshi Temple Madurai
-
నవరాత్రి ఉత్సవాలు : అమృతవర్షంలో మధుర మీనాక్షి ఆలయ కోనేరు (ఫొటోలు)
-
165 రోజుల తరువాత మధుర మీనాక్షి దర్శనం..
మదురై : కరోనా వైరస్ నేపథ్యంలో మూతపడిన మదురైలోని మీనాక్షి అమ్మన్ ఆలయం 165 రోజుల తర్వాత మంగళవారం తిరిగి తెరుచుకుంది. ఆన్‌లాక్-4 ప్రక్రియలో భాగంగా కొత్త సడలింపులతో భక్తులను పునఃదర్శనానికి అనుమతిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తొలిరోజే భక్తులు భారీగా తరలి వచ్చారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు. పుణ్యక్షేత్ర ప్రాంగణంలోకి భక్తులను అనుమతించేముందు ఆలయ సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేసి భక్తుల చేతులకు శానిటైజర్ అందింస్తున్నారు. ముఖానికి మాస్కు లేకుంటే ఆలయంలోకి అనుమతిని నిషేధిస్తున్నారు. (వచ్చే నెలలో తిరుమల బ్రహ్మోత్సవాలు) ఉదయం 6 గంటల నుంచి 12.30 గంటల వరకు తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు భక్తులకు దర్శనాన్ని అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. అంతేగాక 10 సంత్సరాలలోపు పిల్లలను, గర్భిణులను, 60 ఏళ్లు పైబడిన వారిని ఆలయ సందర్శనానికి అనుమతించడం లేదన్నారు. వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యగా భక్తులకు ఎలాంటి ఆహార పదార్థాలు అందించడం లేదని తెలిపారు. అలాగే కొబ్బరికాయలు, పండ్లు, దండలు ఆలయంలోకి అనుమతించడం లేదని పేర్కొన్నారు. అయితే కొన్ని నెలల తరువాత అమ్మవారిని దర్శించుకోవడపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. -
మహా కైలాసమూర్తి
తమిళనాడులో మధురై ప్రసిద్ధ ఆధ్యాత్మిక నగరం. ఇక్కడ మీనాక్షి అమ్మవారి ఆలయం ఉంది. ఈ ఆలయం మూడుప్రాకారాలతో, అనేక గోపురాలతో, గోపురాల నిండా దేవతా విగ్రహాలతో శోభిల్లుతుంటుంది.ఆలయానికి తూర్పున ఉన్న గోపురంపై పరమేశ్వరుని విగ్రహం ఉంది.సాధారణంగా శివుడు ఐదుముఖాలతో ఉంటాడు. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానాలనేవి ఆ ముఖాల పేర్లు. పంచభూతాలకు ఇవి ప్రతీకలు. పైగా పరమేశ్వరుడు పంచకృత్య నిపుణుడు. కానీ ఇక్కడ శివుడు 25 ముఖాలతో, యాభైచేతులతో వివిధ ఆయుధాలు ధరించి కనిపిస్తాడు. సద్యోజాతమూర్తి, వామదేవమూర్తి మొదలైన ఐదుగురు దేవతలు ఒక్కొక్కరూ ఐదు ముఖాలతో కనిపిస్తుండగా ఈ స్వామి ఆ ఐదుగురి సమిష్టిరూపం. ఈయన ముఖాలు కింది వరుసలో 9, దానిపై 7, ఆపై 5, 3, 1 ఇలా బేసి సంఖ్యలో ఉంటాయి. కుడివైపు 25 చేతులతో, ఎడమవైపు 25 చేతులు ఉంటాయి. కైలాసపర్వతంపై పరమేశ్వరుడు ఇలాగే ఉంటాడని స్కాందపురాణం చెబుతోంది. మరికొన్నిచోట్ల ఈయనను మహాసదాశివమూర్తి అని కూడా పిలిచారు.ఈ విగ్రహంలోని 25 ముఖాలూ ఒక్కో కృత్యానికి 5 చొప్పున 25 లీలారూపాలను, ఆయా లీలారూపాలలో ధరించిన ఆయుధాలను ధరించి కనిపిస్తున్నాడు. ఇరవై ఐదు రూపాలను దర్శిస్తే కలిగే ఫలితం ఒక్క మహా కైలాసమూర్తి దర్శనంతో లభిస్తుందని, సాలోక్య ముక్తి లభిస్తుందనీ శైవాగమాలు చెబుతున్నాయి. తమిళనాడులోని కొన్ని ప్రసిద్ధ ఆలయగోపురాలపై తప్ప ఈ స్వామి ప్రత్యేక ఆలయంలో కొలువుదీరి కనపడడు. ఈయన ముక్తి ప్రదాత. సకల సిద్ధిప్రదాత కూడా. శివభక్తులే కాక ప్రతిఒక్కరూ ఈ స్వామి రూపాన్ని తప్పక దర్శించి తీరవలసిందే. – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
మీనాక్షి బ్రహ్మోత్సవం
మదురై అంటే.. అందరికీ గుర్తుకొచ్చేది మీనాక్షి అమ్మవారి సన్నిధి. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారుగా ఇక్కడ కొలువుదీరి ఉన్నది సాక్షాత్తు పార్వతీ దేవి అవతారమే. పురాణాల మేరకు మదురై పాలకుడు మలయ ధ్వజ పాండ్య చేసిన ఘోర తపస్సుకు మెచ్చి ఒక చిన్న పాప రూపంలో భూమి మీదకు పార్వతీదేవి అడుగు పెడతారు. పెరిగి పెద్దయిన ఆమెను వివాహం చేసుకునేందుకు సుందరేశ్వరుడిగా శివుడు ప్రత్యక్షం అవుతాడు. శివ, పార్వతులకు భూమి మీద జరిగిన ఈ వివాహ ఘట్టాన్ని తిలకించేందుకు సమస్తలోకాలు తరలి వచ్చినట్టుగా పురాణాలు చెబుతాయి. ఆ మేరకు ప్రతి ఏటా మీనాక్షి అమ్మవారి సన్నిధిలో చైత్రమాస (చిత్తిరై) ఉత్సవాలు కనులపండువగా నిర్వహిస్తారు. సాక్షి, చెన్నై: మదురై మీనాక్షి అమ్మవారి సన్నిధిలో చిత్తిరై బ్రహ్మోత్సవ శోభ సంతరించుకుంది. బుధవారం జరిగిన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ ఉత్సవాల్లో ముఖ్య ఘట్టాలు 25న అమ్మవారి పట్టాభిషేకం, 27న వివాహ మహోత్సవం, 29న కళ్లలగర్ వైగై నదీ ప్రవేశ సేవలు సాగనున్నాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మదురైలో భద్రతను కట్టుదిట్టం చేశారు. బ్రహ్మోత్సవ శోభ ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ, ఆలయ పాలకమండలి చర్యలు తీసుకుంది. ఆలయ పరిసరాల్లో బ్రహ్మోత్సవ శోభ సంతరించుకుంది. దక్షిణ తమిళనాడులోని భక్త జనం ఇక, అమ్మవారిని దర్శించి పునీతులయ్యేందుకు మదురై బాట పట్టనున్నారు. ఈ ఉత్సవాలకు శ్రీకారం చుడుతూ ఆలయంలో ఉదయం నుంచి విశిష్ట పూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవారి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సర్వాలంకారాలతో స్వామి, అమ్మవార్లను ఆలయ మాడ వీధుల్లో ఊరేగించి, ధ్వజ స్తంభం వద్ద అధిష్టింప చేశారు. ఆలయ శివాచార్యులు విశిష్ట పూజలతో ధ్వజారోహణ కార్యక్రమాన్ని పూర్తిచేశారు. మేళ తాళాలు, శివనామస్మరణ నడుమ బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడుతూ ధ్వజారోహణం నిర్వహించారు. ఉదయం, రాత్రుల్లో అమ్మవారు ప్రత్యేక అలంకరణలతో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. బంగారు వాహనాల్లో మాడ వీధుల్లో తిరుగుతూ భక్తుల్ని కటాక్షిస్తారు. ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలతో పాటు ప్రత్యేక భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తారు. కల్యాణ వైభోగమే ఈ ఉత్సవాల్లో అత్యంత ముఖ్య ఘట్టాలు నాలుగు. ఇందులో అమ్మ వారి పట్టాభిషేకానంతరం తొలి ముఖ్య ఘట్టం. ఈవేడుక ఈనెల 25న జరగనుంది. 27వ తేదీన భక్త జన సందోహం నడుమ మీనాక్షి అమ్మవారు, సుందరేశ్వర స్వామి వారి వివాహ మహోత్సవం కనుల పండువగా జరుగుతుంది. ఆ మరుసటి రోజున 28వ తేదీన రథోత్సవం వైభవంగా సాగనుంది. ఈ ఉత్సవాల్లోనే అత్యంత ముఖ్య ఘట్టం కళ్లలగర్(విష్ణువు) వైగై నదీ ప్రవేశం 29వ తేదీన నిర్వహిస్తారు. మూడో తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కనులపండువలా సాగుతాయి. భద్రత కట్టుదిట్టం మదురై తీవ్ర వాదుల హిట్ లిస్ట్‌లో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆలయ పరిసరాల్లో భద్రత నిత్యం పటిష్టంగానే ఉంటుంది. అయితే, బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మదురై జిల్లా యంత్రాంగం భద్రతను మరింతగా పెంచింది. ప్రధాన ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో జనం తరలి వస్తారు కాబట్టి, ఆ రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండేందుకు చర్యలు చేపట్టారు. ఇటీవల గోపురం వీధిలోని దుకాణాల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరింత పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. దుకాణాలదారులకు తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. -
మీనాక్షి ఆలయంలో మొబైల్ ఫోన్లపై నిషేధం
మదురై: ప్రఖ్యాత మీనాక్షి దేవాలయంలోకి మొబైల్ ఫోన్లు తీసుకురావడంపై నిషేధం విధించారు. ఈ నిషేధం మార్చి 3వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని ఆలయ అధికారిక వర్గాలు వెల్లడించాయి. మద్రాస్ హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆలయ భద్రతాకారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. -
మీనాక్షి అమ్మవారి సేవలో తమన్న
చెన్నై : డబ్బు, పేరు, ప్రఖ్యాతులు ఉన్నా మనిషికి జీవితంలో ముఖ్యంగా కావలసింది ఒకటుంది. అదే మనశాంతి. అందుకు దైవానుగ్రహం ఉండాలి. వీలున్నప్పుడు దైవ దర్శనం చేసుకుంటే భారం అంతా దిగిపోతుంది. నటి నయనతార ఇటీవల అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించారు. తాజాగా హీరోయిన్ తమన్న ప్రసిద్ధి చెందిన దేవాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకుని అలౌకిక ఆనందాన్ని పొందా రు. దశాబ్దం దాటినా కథానాయకిగా తన స్థానా న్ని పదిలపరచుకుంటూ, తమిళం, తెలుగు, హింది భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది తమన్న. కోలీవుడ్‌లో ఇటీవల విక్రమ్‌తో జత కట్టిన తమన్నకు స్కెచ్ చిత్ర విజయం నూతనోత్సాహాన్నిచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం తమిళంలో శీనూరామసామి దర్శకత్వంలో కన్నె కలైమానే చిత్రంలో నటిస్తున్నారు. ఆమె ఇంతకు ముందు ఈ దర్శకుడి దర్శకత్వంలో నటించిన ధర్మదురై మంచి విజయాన్ని సాధించిందన్నది గమనార్హం. తాజా చిత్రంలో ఉదయనిధి స్టాలిన్‌తో నటిస్తున్నారు. ఈ చిత్రం మధురై పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణను జరుపుకుంటోంది. చిత్ర షూటింగ్లో పాల్గొంటున్న తమన్న సోమవారం ఉదయం మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్లారు. ఇతర భక్తులతో పాటు వరుసలో నిలబడి అమ్మవారి, సుందరేశ్వరుడు సన్నిధిని దర్శించుకున్నారు. ఈ సంగతి స్థానికులకు తెలియడంతో తమన్నను చూసేందుకు ఆలయం ముందు గుమిగూడారు. దీంతో ఆ ప్రాంతంలో కాస్త కలకలం చెలరేగింది. దైవ దర్శనం అనంతరం వెలపలికి వచ్చిన ఆమెను పోలీసుల భద్రత నడుమ సురక్షితంగా అక్కడి నుంచి వెళ్లారు. -
మధుర మీనాక్షి ఆలయంలో భారీ అగ్నిప్రమాదం
చెన్నై : ప్రఖ్యాత ఆథ్యాత్మిక క్షేత్రం మధుర మీనాక్షి ఆలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆలయ తూర్పు రాజగోపురం సమీపంలోని వేయీళ్ల మండపం వద్ద శుక్రవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సమీపంలోని 50కి పైగా దుకాణాలు దగ్ధమయ్యాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని మధురై కలెక్టర్ చెప్పారు. అగ్నిప్రమాదంపై సమాచారం తెలిసిన వెంటనే కలెక్టర్ వీరరాఘవరావు ఆలయం వద్దకు చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. పదుల సంఖ్యలో ఫైర్మన్లు గంటలపాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. ప్రమాద సమయంలో భక్తులు, ఆలయసిబ్బంది అక్కడ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పినట్లైంది. అయితే ఆస్తి నష్టం మాత్రం భారీగానే జరిగింది. ఘటనపై విచారణ జరుపుతున్నామని కలెక్టర్ చెప్పారు. కాగా, విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. -
నీటమునిగిన మధుర మీనాక్షి ఆలయం
సాక్షి, చెన్నై: తమిళనాడులోని దక్షిణాది జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వారం రోజులుగా మధురై, సేలం, తిరునెల్వేలి జిల్లాల్లో భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. మధురైలో గురువారం నుంచే కుండపోతగా వర్షం కురుస్తండటంతో నగరంలో పలు రహదారులు జలాశయాలుగా మారాయి. వర్షపు నీరు లోతట్టు ప్రాంతంలోని మధురై మీనాక్షి ఆలయంలోకి చేరడంతో ఆలయ ప్రాంగణంతో పాటు మూలస్థానం కూడా వరద నీటిలో చిక్కుకుంది. ఉత్తర దిశ నుండి తూర్పు దిశకు వరద నీరు వేగంగా పోటెత్తడంతో ఆలయం జలాశయాన్ని తలపించింది. దీంతో ఆలయానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆలయ సిబ్బంది వరద నీటిని బయటకు పంపేందుకు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేదు. వర్షం కురుస్తుండటంతో భక్తులకు ఇబ్బందిగా మారింది. శుక్రవారానికి ఉదయానికి వర్షం కొంత తెరపి ఇవ్వడంతో ఆలయాన్ని శుద్ధి చేసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే మరో మూడు రోజులపాటు దక్షిణాదికి భారీ వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం తెలపడంతో ఆయా జిల్లాల కలెక్టర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గడిచిన 48 గంటల్లో మధురైలో 21 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, తిరునెల్వేలిలో అత్యధికంగా 27 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. తిరునెల్వేలిలోని కుట్రాలం జలపాతాలు వరద నీటితో ప్రమాదస్థాయిలో ప్రవహిస్తుండటంతో పర్యాటకుల సందర్శనకు అధికారులు నిషేధం విధించారు. -
ప్రముఖ దేవాలయంలో బాంబుల కలకలం
చెన్నై: తమిళనాడు మధురైలోని మీనాక్షి ఆలయ సమీపంలో బాంబుపేలుడు ఉద్రిక్తతను రాజేసింది. మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండుగులు బాంబులు విసరడంతో కలకలం మొదలైంది. రెండు గంటల వ్యవధిలో మూడు పెట్రోల్ బాంబులు విసిరారు. మధుర మీనాక్షి ఆలయంలో పెద్ద ఎత్తున పేలుడు శబ్దం వినపడడంతో భక్తులు భయాందోళనతో పరుగులు తీశారు. వీటిలో ఒకటి మాత్రమే పేలడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పెద్దఎత్తున పగిలిన బీరుసీసాలను స్వాధీనం చేసుకున్నామని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు చెప్పారు. జాతీయ భద్రతాదళాలు (ఎన్ఎస్జీ) ఆలయంలోని భద్రతా ఏర్పాట్లు సమీక్షించిని కొన్ని గంటల తరువాత ఈ సంఘటన చోటు చేసుకుంది. డీఎస్పీ విశ్వనాథన్ తన బృందంతో కలిసి పరిస్థితిని పరిశీలించారు. సీసీ టీవీ, రక్షణ వ్యవస్థ, స్కానింగ్ పరికరాలను క్షుణ్ణంగా పరీక్షించారు. పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఉగ్రవాద చర్య అయి ఉంటుందనే అనుమానాలను ప్రాథమిక విచారణ అనంతరం వారు తోసిపుచ్చారు. భద్రతా వ్యవస్థలో కొన్నిమార్పులు సూచించిన ఆయన.. ఆలయ సిబ్బంది, భక్తులు మొబైల్ వాడకాన్ని పరిమితం చేయాలని కోరారు. ఆలయం లోపల జామర్ ఏర్పాటు చేయాలన్నారు.