ప్రముఖ దేవాలయంలో బాంబుల కలకలం
చెన్నై: తమిళనాడు మధురైలోని మీనాక్షి ఆలయ సమీపంలో బాంబుపేలుడు ఉద్రిక్తతను రాజేసింది. మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండుగులు బాంబులు విసరడంతో కలకలం మొదలైంది. రెండు గంటల వ్యవధిలో మూడు పెట్రోల్ బాంబులు విసిరారు. మధుర మీనాక్షి ఆలయంలో పెద్ద ఎత్తున పేలుడు శబ్దం వినపడడంతో భక్తులు భయాందోళనతో పరుగులు తీశారు. వీటిలో ఒకటి మాత్రమే పేలడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పెద్దఎత్తున పగిలిన బీరుసీసాలను స్వాధీనం చేసుకున్నామని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు చెప్పారు.
జాతీయ భద్రతాదళాలు (ఎన్ఎస్జీ) ఆలయంలోని భద్రతా ఏర్పాట్లు సమీక్షించిని కొన్ని గంటల తరువాత ఈ సంఘటన చోటు చేసుకుంది. డీఎస్పీ విశ్వనాథన్ తన బృందంతో కలిసి పరిస్థితిని పరిశీలించారు. సీసీ టీవీ, రక్షణ వ్యవస్థ, స్కానింగ్ పరికరాలను క్షుణ్ణంగా పరీక్షించారు.
పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఉగ్రవాద చర్య అయి ఉంటుందనే అనుమానాలను ప్రాథమిక విచారణ అనంతరం వారు తోసిపుచ్చారు. భద్రతా వ్యవస్థలో కొన్నిమార్పులు సూచించిన ఆయన.. ఆలయ సిబ్బంది, భక్తులు మొబైల్ వాడకాన్ని పరిమితం చేయాలని కోరారు. ఆలయం లోపల జామర్ ఏర్పాటు చేయాలన్నారు.