ఒక టాపర్ కథ
'నిన్ను చదివించే స్తోమత మాకు లేదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. వెంటనే ఇంటికి బయలుదేరు. పెళ్లి సంబంధం చూశా. కుర్రాడు మనలాగే ఇటుకల బట్టీలో కూలీ. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పదపద....' సరిగ్గా మూడు నెలల క్రితం మహేన్ రాయ్.. తన కూతురు స్వప్న రాయ్తో అన్న మాటలివి.
అనుకున్నట్టే పెళ్లి చేసేందుకు కూతుర్ని వెంటబెట్టుకుని అతను తన గుడిసెకు చేరుకున్నాడు . పశ్చిమ బెంగాల్లోని నార్త్ దినాజ్పూర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని చిన్న గ్రామం వాళ్లది. అప్పటికి స్వప్న వయసు 16 ఏళ్లు. ఇంకో మూడు నెలల్లో పదో తరగతి పరీక్షలు.
అయితే స్వప్న మనసంతా చదువుపైనే. ఉన్నత చదువులతో ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నా, చెల్లిని బాగా చూసుకోవాలనుకునేది. అదే విషయం తల్లిదండ్రులకు చెప్పింది. 'బేటీ పడావో' అవసరం తెలియని నిరక్షరాస్యులు వాళ్లు. సహజంగానే తల్లిదండ్రులు 'చదువొద్దు.. పెళ్లే ముద్దు' అన్నారు. చదువు తప్ప స్వప్నకు మరోదారి కనిపించలేదు. దాంతో పోరాటానికి సిద్ధమైంది. దినాజ్ పూర్ జిల్లా కేంద్రంలో తాను చదువుతోన్న స్కూల్ టీచర్లకు గోడు చెప్పుకుంది.
రంగంలోకి దిగిన టీచర్లు.. ప్రభుత్వాధికారుల సహాయంతో ఆ బాల్య వివాహ ఒప్పందాన్ని రద్దు చేయించారు. అంతేకాకుండా బెంగాల్ ప్రభుత్వ పథకమైన గీతాంజలి ఆవాస్ యోజన కింద ఓ ఇట్టు కట్టించి, స్వప్న కుటుంబానికి ప్రభుత్వాధికారులు ఆర్థిక సాయం కూడా అందించారు. దాంతో స్వప్న మళ్లీ స్కూలుకు వెళ్లింది.
ఇటీవలే ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో 92 శాతం మార్కులు సాధించిన స్వప్న స్కూల్ టాపర్గా నిలిచింది. లెక్కల్లో 99, ఫిజిక్స్లో వందకు వంద, లైఫ్ సైన్స్లో 97, హిస్టరీలో 91, జాగ్రఫీలో 93, ఇంగ్లీష్లో 76, బెంగాలీలో 92 మార్కులు సాధించి ఔరా అనిపించింది. స్వప్న తండ్రి మహేన్ రాయ్ ఇప్పుడేమంటున్నాడో చూడండి..
'నిజంగా నేనెంత పొరపాటు చేశాను. చదువుకుంటానని నా కూతురు ఎంత అరిచినా వినిపించుకోలేదు. అధికాలు వచ్చి పెళ్లి వద్దన్నప్పుడు కోపమొచ్చింది కూడా. నా బిడ్డ ఇంత బాగా చదవగలదని, ఫస్ట్ వస్తుందని నేను ఊహించలేదు. రెండో కూతురు ప్రస్తుతం వేరొక హాస్టల్లో చదువుతోంది. కష్టమైనా సరే నా కూతుళ్ల చదువుల కోసం రక్తం ధారపోస్తా' అని సంతోషంగా తెలిపాడు.
'నాకు హ్యుమానిటీస్ సబ్జెక్టులో చేరాలని ఉంది. ఆ తర్వాత మంచి యూనివర్సిటీలో డిగ్రీ సాధించి టీచర్ కావాలన్నది నా ఆశయం. సైన్స్ గ్రూప్ చదవడానికి నాకు అన్ని అర్హతలున్నాయి. కానీ మా ఆర్థిక స్తోమత అంతంతే. అందుకే ఆర్ట్స్ గ్రూపులో చేరదామనుకుంటున్నా. అదైతే తక్కువ ఖర్చుతో చదివెయ్యొచ్చు' అంటూ తన కలల్ని పంచుకుంది టాపర్ స్వప్న రాయ్.