
సాక్షి, న్యూఢిల్లీ : ‘హిందువులంతా సహజంగానే భారత పౌరులు’ అనే ఆరెస్సెస్ నినాదాన్ని పునరుద్ఘాటిస్తూ మేఘాలయ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఆర్ సేన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి దిమ్మతిరిగిపోయే తీర్పును వెలువరించారు. ‘2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భారత పౌరసత్వ సవరణ బిల్లు ప్రకారం దేశంలోని హిందువులు, సిక్కులు, జైనులు, బుద్ధిస్టులు, పార్శీలు, క్రైస్తవులు, ఖాసీలు, జెంటియాలు, గారోలులకు భారత పౌరసత్వం మంజూరు చేయండి’ అంటూ తీర్పు చెప్పారు. ఇప్పటికే భారత్‌లో శాశ్వత నివాసం ఉంటున్న వీరికే కాకుండా భవిష్యత్తులో భారత్‌కు వచ్చే ఈ జాతులకు చెందిన వారందరికి భారత పౌరసత్వం మంజూరు చేయాల్సిందేనన్నారు. వీరంతా కూడా హిందువుల కిందకే వస్తారని పరోక్షంగా చెప్పారు. బహూశ హిందూ ఓ మతం కాదని, అది ఓ జీవన విధానమన్న బీజేపీ విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకొని ఈ ఆదేశాలు జారీ చేసినట్లున్నారు. ఆ మాటకొస్తే ఆరెస్సెస్ చెప్పే చరిత్ర ప్రకారం ‘అఖండ్ భారత్’ అంటే అఫ్ఘానిస్తాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాలు కూడా వస్తాయని అన్నారు. ఆ మాటకొస్తే ఆ దేశాల పౌరులకు కూడా పౌరసత్వం మంజూరు చేయాల్సి ఉంటుందన్న హెచ్చరిక కాబోలు! అంతేకాకుండా తానిచ్చిన ఈ తీర్పు ప్రతిని ప్రధాన మంత్రి, కేంద్ర న్యాయ, హోం మంత్రులకు కూడా పంపించాలని సూచించారు.
తాము పుట్టిన నేల, తాము పూర్వికులు నమ్ముకున్న నేల భారత్ అయినప్పుడు అందరికి పౌరసత్వం ఇవ్వాల్సిందేనని జస్టిస్ సేన్ చెప్పారు. ఈ దేశం నుంచి పాకిస్థాన్ మతం ప్రాతిపదికన విడిపోయి ఇస్లామిక్ రాజ్యాంగ ప్రకటించుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ అప్పుడే భారత్ కూడా తమది ‘హిందూ’ రాజ్యమని ప్రకటించుకొని ఉండాల్సిందని, లౌకిక రాజ్యం కనుక భారత్‌లోని అన్ని మతాల వారికి పౌరసత్వ హక్కు ఉంటుందన్నారు. భారత గడ్డపై స్థిర నివాసం ఏర్పరుచుకొని, భారతీయ చట్టాలను గౌరవిస్తున్న ముస్లింలకు కూడా పౌరసత్వం ఇవ్వాల్సిందేనన్నారు. 2016లో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంలోని ముస్లిం మతస్థుల ప్రస్తావన కూడా లేని విషయాన్ని ఆయన దష్టిలో పెట్టుకున్నట్లుంది.
భారతీయ పౌరులెవరో తేల్చడానికి అస్సాంలో సవరించిన పౌరసత్వ జాబితాలో గల్లంతయిన 40 లక్షల మందికి కూడా పౌరసత్వం ఇవ్వాల్సిందేనని జస్టిస్ సేన్ పరోక్షంగా సూచించారు. బంగ్లా ముస్లింలుగా భావిస్తున్న వారంతా బెంగాల్ నుంచి వచ్చినవాల్లేనని, బెంగాల్ పలు సార్లు హింసాకాండతో విడిపోయిందని, ఫలితంగా శరణార్థులు భారత్‌లోని ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన చరిత్ర పుటల్లోని పలు అంశాలను ప్రస్తావించారు. అస్సాం దురాక్రమణ గురించి, బెంగాల్ విభజన, బంగ్లాదేశ్ యుద్ధం తదితర అనేక అంశాలను ఆయన గుర్తు చేశారు. చరిత్రకు సంబంధించి కోర్టు నియమించిన కమిటీలు సమర్పించిన వివిధ నివేదికల్లోని అంశాలను ప్రస్తావించారు.
పాకిస్థాన్ విడిపోయినప్పుడు భారత్ తనది ‘హిందూ’ దేశంగా ప్రకటించుకొని ఉండాల్సిందన్న సేన్ వ్యాఖ్యలపై సీపీఎం నాయకత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ జడ్జీని తొలగించాల్సిందిగా డిమాండ్ చేసింది. దీనిపై కూడా జస్టిస్ సేన్ స్పందిస్తూ ‘నేను లౌకిక వాదానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. నేను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కాను. మత పరమైన వేధింపులకు, దాడులకు గురైన వారికి న్యాయం జరగాలన్నదే నా అభిమతం’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment