శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ బీజేపీ ఆరోపణలను తోసిపుచ్చారు. పీడీపీ-బీజేపీ సంకీర్ణ సర్కార్‌కు బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్న క్రమంలో కాషాయ పార్టీ చేసిన విమర్శలకు మెహబూబా ముఫ్తీ దీటుగా బదులిచ్చారు. బీజేపీ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. సంకీర్ణ సర్కార్ అజెండాకు బీజేపీ స్వయంగా నీళ్లొదిలిందని దుయ్యబట్టారు.
ఆర్టికల్ 370పై యథాతథ స్థితి, పాకిస్తాన్, హురియత్ నేతలతో చర్చలు సంకీర్ణ అజెండాలో భాగమని పేర్కొన్నారు. ఘర్షణలతో అట్టుడుకుతున్న కశ్మీర్‌లో క్షేత్రస్థాయిలో ప్రజలకు విశ్వాసం కల్పించే క్రమంలో రాళ్ల దాడికి పాల్పడిన వారిపై కేసుల ఉపసంహరణ, కాల్పుల విరమణ తక్షణం చేపట్టాల్సిన చర్యలని ఆమె ట్వీట్ చేశారు. జమ్ము, లడఖ్ ప్రాంతాలపై వివక్ష చూపుతున్నామనే బీజేపీ ఆరోపణలను తిప్పికొట్టారు.
జమ్ము నుంచి బీజేపీ మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్నారని వారి సామర్థ్యాన్ని ఆ పార్టీ సమీక్షించుకోవాలని పేర్కొంది. జర్నలిస్టు షుజత్ బుఖారి హత్య నేపథ్యంలో భాపప్రకటనా స్వేచ్ఛపై బీజేపీ వ్యాఖ్యలను మెహబూబా ముఫ్తీ ఎద్దేవా చేశారు. కథువా లైంగిక దాడి కేసుకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే ఇప్పటికీ జర్నలిస్టులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. కాగా బీజేపీ, పీడీపీ పరస్పర విమర్శలను మాజీ సీఎం ఒమర్ అబ్ధుల్లా ఆక్షేపించారు. రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని, బాలీవుడ్ సినిమాలను మరిపించే స్ర్కిప్ట్‌లతో రక్తికటిస్తున్నాయని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment