12 మంది పిల్లలకు పశువుల ఇంజక్షన్
కర్ణాటకలోని కోలారు జిల్లాలో ఘటన
కోలారు: మానసిక వ్యాధిగ్రస్తురాలైన ఓ మైనర్ బాలిక 12 మంది పిల్లలకు పశువులకు వేసే మందుతో ఇంజక్షన్ చేయగా బాధితులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఉదంతం కర్ణాటకలోని కోలారు జిల్లా శ్రీనివాసపురం తాలూకా నక్కలగుడ్డ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. శ్రీనివాసపురం తాలూకా మరంపురం గ్రామానికి చెందిన మైనర్ బాలిక శైలజ నక్కలగుడ్డకు చేరుకొని తాను నర్సునని, పల్స్ పోలియో తర్వాత పిల్లలకు ఇంజక్షన్ చేసేందుకు గౌనిపల్లి పీహెచ్‌సీ వైద్యులు తనను పంపారని స్థానికులకు తెలిపింది.
అనంతరం 12 మంది పిల్లలకు పశువులకు వేసే మెలాక్సికోం అనే మందులతో ఇంజక్షన్ చేసింది. కొంత సేపటికి పిల్లలు అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై శ్రీనివాసపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కోలారు ఆర్ ఎల్ జాలప్ప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు శైలజ(13)ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా.. ఆ బాలికకొంత కాలంగా మానసిక అస్వస్థతతో బాధపడుతున్నట్లు తేలింది.