
న్యూ ఢిల్లీ : మహిళా ప్రయాణికుల ద్వారా ఢిల్లీ మెట్రోకు ప్రతిరోజూ 2.84కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోందని, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తీసుకున్న నిర్ణయంతో ఢిల్లీ మెట్రో ఆదాయనికి భారీగా గండిపడుతుందని ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ మాజీ డైరక్టర్ ఈ శ్రీధరన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇదివరకే భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఆపు చేసేలా చర్యలు తీసుకోవాలని ‘‘మెట్రోమ్యాన్’’ శ్రీధరన్ లేఖలో ప్రధానిని కోరారు. ఢిల్లీ మెట్రోకు మూడింట రెండు వంతుల నిధులు జపాన్ ప్రభుత్వం నుంచి అందుతున్నాయని, సామాన్య ప్రజలందరికీ మెట్రో ఛార్జీలు అందుబాటులో ఉండేలా చూసుకుంటూ లోన్ తిరిగి చెల్లించేలా చూసుకోవాలని తెలిపారు. అయితే ఢిల్లీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయంతో మెట్రో ఉనికికే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆప్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం మహిళలకు సహాయం చేయటం కోసంకాదని, రానున్న ఎన్నికల్లో మహిళల ఓట్లు దండుకోవాలనేనని మండిపడ్డారు. కేవలం మహిళలకు మాత్రమే రాయితీలు ఇవ్వటం కుదరదన్నారు. వారికంటే ఎక్కువగా వయోవృద్ధులకు, విద్యార్థులకు, దివ్యాంగులకు మెట్రో రాయితీల అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. కానీ వారందరికి ప్రస్తుతం ఎలాంటి రాయితీలు ఢిల్లీ మెట్రో ఇవ్వటం లేదన్నారు. ఢిల్లీ మెట్రోలో మహిళలకు ఉచిత సదుపాయం కల్పిస్తే గనుక అది అంటురోగంలా దేశం మొత్తం ఉన్న మెట్రోలకు పాకుతుందని అన్నారు. అలా జరిగితే మెట్రో వ్యవస్థ రాయితీల కోసం ప్రభుత్వాల మీద ఆధారపడవల్సి ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment