
ముంబై : ఎంజీ మోటార్ ఇండియాకు ఓ కస్టమర్ షాకిచ్చాడు. ఈ కంపెనీ మార్కెట్‌లో ఇటీవల లాంఛ్ చేసిన ప్రీమియం ఎస్‌యూవీ హెక్టార్ వాహనాన్ని గాడిదతో లాగించి ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఈ వాహనంపై డాంకీ వెహికల్ అని రాసి ఉన్న బ్యానర్‌ను అమర్చి యూట్యూబ్ చానెల్‌లో ఉదయ్‌పూర్‌కు చెందిన విశాల్ పంచోలి అప్‌లోడ్ చేయగా ఇప్పటికీ 2.74 లక్షల వ్యూస్ లభించాయి. వైరల్‌గా మారిన ఈ వీడియోపై ఎంజీ మోటార్ మండిపడుతోంది. పంచోలి కొనుగోలు చేసిన హెక్టర్‌లో క్లచ్ సంబంధిత సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ లోపాన్ని కంపెనీ అధికారులు సరిదిద్దకపోగా తనను బెదిరించారని ఈ వీడియోలో కస్టమర్ వాపోయారు. అయితే పంచోలి ఆరోపణలను ఎంజీ మోటార్ ఇండియా తోసిపుచ్చింది. కస్టమర్ సమస్యను పరిష్కరించేందుకు అన్ని చర్యలూ చేపట్టామని స్పష్టం చేసింది. కస్టమర్ సమస్యను పూర్తిగా పరిష్కరించినా తమ కంపెనీ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించాడని ఆరోపించింది. తమ బ్రాండ్ ప్రతిష్టకు విఘాతం కలిగిస్తున్న విశాల్ పంచోలిపై తగిన చర్యలు తీసుకుంటామని ఎంజీ మోటార్ ఇండియా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment