
'జగన్ బటన్ నొక్కితే ముద్రగడ స్పందిస్తున్నారు'
న్యూఢిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కితే కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్పందిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిన్న ఢిల్లీ వచ్చిన ఆయన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీఇరానీ, పెట్రోలియం శాఖ మంతిర ధర్మేంద్ర ప్రదాన్ లను కలిశారు. గంటా శ్రీనివాసరావు గురువారం టీడీపీ ఎంపీలు తోట నర్సింహం, అవంతీ శ్రీనివాసరావుతో కలిసి ఏపీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. జగన్ రాజకీయ క్రీడలో ముద్రగడ పడొద్దని సూచించారు.
ముఖ్యమంత్రికి ముద్రగడ రాసిన లేఖ అనైతికంగా ఉందని గంటా పేర్కొన్నారు. కాపుల సంక్షేమం కోసం పాటుపడేవారు రాసిన లేఖలా లేదని విమర్శించారు. రాజకీయ ఆరాటంతోనే ముద్రగడ ఇలా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో గిరిజన, కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ఈ ఏడాదే ప్రారంభించేందుకు అవసరమైన ప్రక్రియ పూర్తిచేయాలని కేంద్ర మంత్రిని కోరినట్టు తెలిపారు. న్యాక్ గుర్తింపు కలిగిన విశ్వవిద్యాలయాలకు ఆర్థిక సాయం చేయాలని కోరినట్టు వివరించారు.