
దృష్టి మళ్లించడానికే ‘హైకోర్టు’పై వివాదం
మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీ టీజీ వెంకటేశ్
సాక్షి, నూఢిల్లీ: మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై ప్రజా వ్యతిరేకత, జేఏసీతో ఉన్న విభేదాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు విభజనపై అనవసర వివాదాన్ని సృష్టిస్తోందని మంత్రి కామినేని శ్రీనివాస్ విమర్శించారు. బుధవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ... హైకోర్టు విభజనపై కేంద్రాన్ని, ఏపీని నిందించడం సరికాదని చెప్పారు. న్యాయవ్యవస్థకు ప్రాంతీయ విభేదాలు అంటకట్టడం న్యాయం కాదన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తమ చేతిలో ఉన్న అంశాలైన ఆస్తుల పంపకాలు, 9,10 షెడ్యూల్ ఉన్న అంశాల గురించి తేల్చకుండా, కోర్టు పరిధిలో ఉన్న హైకోర్టు విభజనపై రాద్ధాంతం చేయడమేమిటని నిలదీశారు. హైకోర్టు విభజనపై మౌలిక సదుపాయాలు కల్పించాలని హైకోర్టు లేఖ రాసిందని, అందుకు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. ఈ భూమి ఎంపికపై సుప్రీంకోర్టు, ైెహ కోర్టు న్యాయమూర్తులు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. విభజన చట్టం విషయంలో తెలంగాణ ప్రభుత్వం మొండివైఖరి ప్రదర్శిస్తోందని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ విమర్శించారు. టీసర్కారు మళ్లీ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతోందని ఆరోపించారు.