
అలహాబాద్(యూపీ) : పార్టీ కార్యకర్తలు ఓ మంత్రి కాళ్లుపట్టుకుని మసాజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలహాబాద్ సౌత్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఉత్తర ప్రదేశ్ మంత్రి నందగోపాల్ వరండా మీద పడుకుని ఉండగా.. బీజేపీకి చెందిన ఓ కార్యకర్త ఆయన కాళ్లు పట్టారు. ఆ తర్వాత మరో కార్యకర్త కూడా మంత్రి కాళ్లు పట్టుకొని మసాజ్ చేశారు. మంత్రి వరండాపై ప్రశాంతంగా పడుకోగా, ఆయన తల దగ్గర అలహాబాద్ నార్త్ నియోజకవర్గ ఎమ్మెల్యే హర్షవర్ధన్ బాజ్‌పాయ్ కూర్చుని ఉన్నారు. మరికొందరు బీజేపీ కార్యకర్తలు అక్కడే నిల్చొని ఉన్నారు. ఈ తతంగం మొత్తాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీయడంతో ఈ విషయం వెలుగుచూసింది.
నవంబర్ 22న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరు నెలల పనితీరుకు ఈ ఎన్నికలు కొలమానంగా భావిస్తోంది బీజేపీ. దీంతో ఎలాగైనా అలహాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పాగా వేయాలని చూస్తోంది. ఈ క్రమంలో మంత్రి నందగోపాల్ అలహాబాద్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాస్త ఎక్కువగా నడవడంతో అలసిపోయి ఓ కార్యకర్త ఇంటికి వెళ్లి వరండాపై పడుకున్నారు. మంత్రి కాళ్లు నొప్పి పుట్టాయని భావించిన కార్యకర్తలు..వెంటనే ఆయన కాలికి మసాజ్ చేయడం మొదలుపెట్టారు. ఒకరి తర్వాత ఒకరు ఆయన కాళ్లు పడుతున్నా మంత్రి కనీసం వారిని వారించలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు మంత్రిపై మండిపడుతున్నారు.
మంత్రి కాళ్లు పట్టుకొని మసాజ్ చేసిన కార్యకర్తలు
Comments
Please login to add a commentAdd a comment