మరో వివాదంలో మహిళా మంత్రి!
ముంబై: రాష్ట్ర మహిళా మంత్రి పంకజ ముండే తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ఓ ప్రధాన ఆలయ పూజారిని, ఆయన మద్ధతుదారులను బెదిరిస్తున్నట్లుగా ఉన్న ఆడియో టేపులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆమె నియోజకవర్గంలోని ఓ ఆలయంలో గతంలో ఆమె తండ్రి ప్రతి దసరా వేడుకలలో పాల్గొనేవారు. ఆ ప్రాంతం సమీపంలో రాజకీయ ప్రసంగాలు కూడా ఇచ్చేవారు. ఈ క్రమంలో వంజారీ కమ్యూనిటీకి చెందిన కొందరు ఆమెను భగవాన్ గడ్ లో దసరా వేడుకలలో పాల్గొనాలని కోరగా, మంత్రి మద్ధతుదారులు ఆలయ పూజారి వర్గంపై బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. మీపై అకారణంగా కేసులు బుక్ చేస్తామని మంత్రి పంకజ హెచ్చరిస్తున్నట్లుగా ఉన్న ఆడియోపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఈ ఆడియో వివాదంపై ప్రధాన పూజారి నామ్ దేవ్ శాస్త్రిని జాతీయ మీడియా సంప్రందించగా.. దసరా వేడుకలలో ప్రసంగించేందుకు ఆమె నిరాకరించారని, మరికొన్ని పనులకు వారికి అడ్డంకులు ఉన్నాయని తెలిపారు. ఈ విషయంపై మంత్రి పంకజ గానీ, బీజేపీ నేతలు గానీ నోరు మెదపకపోవడం గమనార్హం. ప్రతిపక్ష నేత ధనంజయ్ ముండే మాట్లాడుతూ.. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న మంత్రి పంకజను ఆ పదవి నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.
ఇటీవల కరువు జిల్లా లాతురులో నదీ పునరుద్దరణ పనులు పర్యవేక్షించిన సందర్భంగా ఆమె ఎండిపోయిన నదీ ఒడ్డున నిల్చుని దిగిన ఫొటో సోషల్ మీడియాలో పెను దుమారం రేపింది. ఓ వైపు రైతులు సమస్యలు ఎదుర్కొంటుంటే మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఈ విధంగా సెల్ఫీలు దిగడం పూర్తిగా నిర్లక్ష్యమేనని విమర్శలొచ్చాయి. దీంతో ఆమె సోషల్ మీడియాలో ఆ పోస్ట్ డిలీట్ చేసిన విషయం తెలిసిందే.