యూపీ మంత్రి అనుపమా జైస్వాల్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, లక్నో : ప్రభుత్వ పథకాల అమలు కోసం రాష్ట్ర మంత్రులు రేయింబవళ్లు కష్టపడుతున్నారని యూపీ మంత్రి అనుపమా జైస్వాల్ చెప్పుకొచ్చారు. అన్ని వర్గాల ప్రయోజనాల కోసం చేపట్టిన పథకాల అమలుకు మంత్రులు దోమలు కుడుతున్నా లెక్కచేయకుండా పనిచేస్తున్నారని ఆమె కితాబిచ్చారు. మంత్రులు తమకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఎక్కడా ఫిర్యాదు చేయకుండా మరింత ఉత్సాహంగా ముందుకెళుతున్నారన్నారు. ఇలా పనిచేస్తున్నందుకు తమకు వచ్చే సంతృప్తే తమకు బలాన్నిస్తోందని వ్యాఖ్యానించారు.
యూపీ మంత్రి సురేష్ రాణా దళితుని ఇంట పార్శిల్ భోజనం చేయడంతో రేగిన దుమారంపై స్పందిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీ మంత్రి నిర్వాకంపై విపక్షాలతో పాటు వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు తాను దళితుల ఇళ్లలో భోజనాలకు వెళ్లబోనని, తన ఇంటికే వారిని ఆహ్వానించి విందు ఇస్తానని కేంద్ర మంత్రి ఉమాభారతి వ్యాఖ్యానించి మరో వివాదానికి తెరతీశారు. బీజేపీ నేతలు, మంత్రులు ఆచితూచి మాట్లాడాలని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించినా బీజేపీ నేతలు నోరుజారి వివాదాల్లో కూరుకుపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment