సాక్షి, న్యూఢిల్లీ: ఫేస్‌బుక్ వినియోగదారుల సమాచారం దుర్వినియోగమవుతుందన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. డాటా లీక్‌పై సమాచారం ఇవ్వాలని, ఏప్రిల్ 7లోగా పూర్తి సమాచారాన్ని తమకు అందించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఫేస్‌బుక్‌ను కోరింది. కేంబ్రిడ్జ్ అనాలిటికా సంస్థ ఫేస్‌బుక్ వినియోగదారుల సమాచారాన్ని తస్కరించి ఎన్నికలతోపాటు ఇతర ప్రయోజనాలకు వాడుకున్నట్టు వెలుగుచూడటం దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్ నుంచి ఈ మేరకు సంజాయిషీ కోరుతూ కేంద్ర సమాచార, ప్రసారశాఖ లేఖ రాసింది.
ఎన్నికలను ప్రభావితం చేసేలా ఫేస్‌బుక్ సమాచారాన్ని తస్కరించి.. అవకతవకలకు పాల్పడ్డట్టూ కేంబ్రిడ్జ్ అనాలిటికా (సీఏ) ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ సంస్థకు కూడా కేంద్రం ఈ నెల 23న నోటీసులు పంపింది. ఫేస్‌బుక్ నుంచి సమాచార ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలని కోరింది. భారతీయ ఓటర్లు, భారతీయ వినియోగదారుల వ్యక్తిగత సమాచారం విషయంలో సీఏ ఏమైనా ఉల్లంఘనలకు, అవకతవకలకు పాల్పడిందా? ఫేస్‌బుక్ లేదా దాని అనుబంధ సంస్థలు ఫేస్‌బుక్ సమాచారాన్ని ఉపయోగించుకొని గతంలో భారత ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించాయా? అన్నది తెలుపాలని కోరింది. ఫేస్‌బుక్ సమాచార ఉల్లంఘనలపై మరింత వివరాలు తెలుసుకోవాల్సిన అవసరముందని, అందుకే తాము ఫేస్‌బుక్‌కు ఈ మేరకు లేఖలు పంపామని కేంద్ర సమాచార శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment