సాక్షి, గుహవాటి: పదిహేనేళ్ల బాలుడు చిలిపిగా చేసిన రాంగ్ కాల్ అతడి జీవితాన్నే తారుమారు చేసింది. అస్సాంలోని గోల్‌పాడా జిల్లాకు చెందిన కుర్రాడు చదువు మధ్యలోనే ఆపేసి కార్మికుడిగా మారాడు. ఓ రోజు టైమ్‌పాస్ కాక రాంగ్ కాల్ చేశాడు. అవతలి నుంచి మాట్లాడింది ఆడ గొంతు కావడంతో డబుల్ హ్యాపీగా ఫీలయ్యాడు. ఇక ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. రోజుకొకసారైనా మాట్లాడుకోంది ఇద్దరూ ఉండలేని పరిస్థితికి వచ్చారు. అలా నెలరోజులగా ఆమెతో ఫోన్ మాట్లాడటంతో నిండా ప్రేమలో మునిగిపోయాడు. ఇక ఆగలేక కచ్చితంగా ఆమెను కలవాలని ఆమె చెప్పిన ఆడ్రస్‌కు వెళ్లాడు. సీన్ కట్ చేస్తే స్టోరీ రివర్సయింది.
అలా ఆమె చెప్పిన అడ్రస్‌కు వెళ్లి ఒకరినొకరు చూసుకోగా ఇద్దరూ షాక్‌కు గురయ్యారు. ఆమె బార్‌పేట జిల్లా సుఖూవాజార్‌కు చెందిన 60 ఏళ్ల వితంతువు. నెలరోజులుగా మాట్లాడుకున్నా ఇద్దరూ వయసుల గురించి మాట్లాడుకోకపోవడం గమనార్హం. ఈ వ్యవహారం తెలిసిన మహిళ బంధువులు, సన్నిహితులు, పొరుగింటివారు బలవంతంగా ఆ ఇద్దరికీ వివాహం చేశారు. తమకు ఇష్టం లేకుండా వివాహం చేశారని ఇరువురూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పిల్లల హక్కుల కమిషన్ దీనిపై విచారణకు ఆదేశించింది. అబ్బాయి మైనర్ అయివుంటే.. బలవంతంగా వివాహం చేసినవారిపై చట్టపరమైన శిక్షలు ఉంటాయని కమిషన్ పేర్కొంది. ఇక ఈ గొడవపై స్పందించిన గోల్‌పాడా డిప్యూటీ కమిషనర్ వార్నాలి డెకా.. ఆ ఇద్దరి పెళ్లి గురించి ఇప్పటివరకు తమ దృష్టికి రాలేదని, కానీ ఎవరైన దీనిపై విచారణ కోరితే దర్యాప్తు చేసి దోషులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment