‘మృత్యు వేట ఎలా తప్పిందంటే..’
‘మృత్యు వేట ఎలా తప్పిందంటే..’
Published Tue, Nov 22 2016 6:24 PM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM
పుఖ్రయా: ‘భూమ్మీద ఇంకా నూకలున్నట్లున్నయి. నీ తలరాత బాగున్నట్లుంది’ అనే మాట గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఉపయోగిస్తుంటారు. ఎవరైనా చావు అంచులకు వెళ్లొచ్చినా, వెంట్రుక వాసిలో ప్రాణ ప్రమాదం నుంచి బయటపడినా ఈ మాట అంటుండటం పరిపాటి. కొంతమందికి ఎదురైన కొన్ని సంఘటనలు వింటుంటే నిజమేనట్లుంది అనిపించక మానదు కూడా. ఉత్తర ప్రదేశ్ లోని పుఖ్రయా వద్ద ఇండోర్ పట్నా ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పి 148మంది ప్రాణాలు బలిగొన్న విషయం తెలిసిందే. ఇందులో నుంచి సంతోష్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తి అదృష్టం కొద్ది ప్రాణాలతో బయటపడ్డాడు. అది కూడా ఓ ఇద్దరి వల్ల. వారితో సీటు మార్చుకున్న కారణంగా అతడు మృత్యువేట నుంచి తప్పించుకోగలిగాడు.
ఆ అనుభవాన్ని ఒక్కసారి తన మాటల్లోనే వింటే.. ‘నేను కూడా ఇండోర్ పట్నా రైలులో ఎక్కాను. నా సీటు ఎస్ 2 బోగీలో ఉంది. అయితే, ఓ భార్య భర్తలకు రెండు వేర్వేరు బోగీల్లో సీట్లు లభించాయి. దీంతో వారికి ఎస్ 5 బోగీల్లో సీటు ఉందని, అందులోకి వెళ్లి కూర్చుంటే వాళ్లిద్దరు ఒకే చోట ఉండొచ్చని చెప్పారు. దీంతో మానవతా దృక్పథంతో స్పందించి అందుకు ఒప్పుకున్నాను. వారికి నా సీటు ఇచ్చి నేను వెళ్లి ఎస్ 5 బోగీలో కూర్చున్నాను. అప్పుడు సమయం రాత్రి 10.30. ఆ సమయంలో రైలు బీనా నుంచి బయలు దేరింది. సరిగ్గా మూడుగంటల ప్రాంతంలో 14 బోగీలు పట్టాలు తప్పాయి. అందులో ఎస్ 1, ఎస్ 2, ఎస్ 3, ఎస్ 4 బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. నాకు సీటు ఇచ్చిన ఆ దంపతులు చనిపోయారు. వారు ఉన్న బోగిలో ఎవరూ బ్రతికి ఉన్నారని నేను అనుకోను. నా జీవితాన్ని కాపాడిన ఆ దంపతులకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా మాటలు రావడం లేదు. చెప్పడానికి కూడా వారు లేరు’ అంటూ సంతోష్ ఉపాధ్యాయ్ కంట తడిపెట్టాడు.
Advertisement
Advertisement