Indore Patna Express
-
రైలు ప్రమాదాలు తగ్గాయ్..
సాక్షి, న్యూఢిల్లీ: రైలు ప్రమాద మృతుల సంఖ్య ఇటీవల గణనీయంగా తగ్గినట్లు రైల్వే శాఖ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు 75 ప్రమాదాలు జరిగాయి. 40 మంది మృతి చెందారు. గత ఐదేళ్లలో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువ. భద్రతా పరంగా రైల్వే శాఖ తీసుకుంటున్న చర్యల ఫలితంగానే ప్రమాదాలతో పాటు మృతుల సంఖ్య కూడా తగ్గించగలిగామని రైల్వే శాఖ పేర్కొంటోంది. 2016 సెప్టెంబర్ నుంచి 2017 ఆగస్టు మధ్య 80 ప్రమాదాలు జరగ్గా 249 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. 2016 నవంబర్లో కాన్పూర్ దగ్గర ఇండోర్–పాట్నా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘోర ప్రమాదంలో 150 మంది చనిపోయారు. 2017 ఆగస్టులో ఉత్కల్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో 20 మంది చనిపోయారు. ఈ ఏడాది ఏప్రిల్ 26న ఉత్తరప్రదేశ్లో ఓ స్కూల్వ్యాన్ను రైలు ఢీకొట్టడంతో 13 మంది చిన్నారులు మృతి చెందారు. ఈ కాలంలో ఈ రెండే పెద్ద ప్రమాదాలని రైల్వే శాఖ తెలిపింది. గాయాలయిన వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. గత సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు మధ్య రైలు ప్రమాదాల్లో గాయపడిన వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. 272 నుంచి 12కు క్షతగాత్రుల సంఖ్య తగ్గింది. మెరుగ్గా రైల్వే ట్రాక్ నిర్వహణ , పాత బోగీల స్థానంలో అధునాతన కోచ్ల ఏర్పాటు, బోగీల నిర్వాహణపై గత నాలుగేళ్లుగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్లే ప్రమాదాలు, మృతుల సంఖ్య తగ్గించగలిగామని రైల్వే శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. పట్టాలను ఎప్పటికప్పుడు మార్చడం, భద్రతపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడం, మెరుగైన భద్రతా చర్యల కోసం ఉద్యోగులకు నిరంతర శిక్షణ, పర్యవేక్షణ కూడా ప్రమాదాల్లో క్షతగాత్రుల సంఖ్య తగ్గడానికి కూడా కారణాలుగా చెబుతున్నారు. కాపలాలేని క్రాసింగ్ వద్ద కూడా వాహనచోదకులు నిర్లక్ష్యంగా పట్టాలు దాటడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ ప్రమాదాల సంఖ్య కూడా ఇటీవల తగ్గిందని కూడా రైల్వే శాఖ అధికారులు చెప్పారు. 2016–17లో 13 ప్రమాదాలు జరగ్గా గత సెప్టెంబర్ నుంచి ఆగస్టు వరకు ఎనిమిది మాత్రమే ప్రమాదాలు జరిగాయన్నారు. ఈ తరహా ప్రమాదాలను కూడా తగ్గించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. గాంధీ జయంతి రోజు రైళ్లలో శాకాహారమే జాతిపిత మహాత్మాగాంధీ 150 జయంతి సందర్భంగా అక్టోబర్ 2న రైళ్లలో ఐఆర్సీటీసీ శాకాహార భోజనమే సరఫరా చేయనుంది. ఆ రోజు ప్రత్యేక శాకాహార వంటకాలను ప్రయాణికులకు అందజేయనున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది. ప్రయాణికులు ఆ రోజు మాంసాహారాన్ని ఆర్డర్ చేసే అవకాశం లేదని పేర్కొంది. ఇది ఆ ఒక్క రోజుకు మాత్రమే పరిమితమని ఐఆర్సీటీసీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు రైల్వే బోర్డు గతవారం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు అన్ని జోన్ల రైల్వే శాఖలు ఆ రోజు శాకాహార మెనును అమలు చేయనున్నాయి. ఈ స్పెషల్ మెనూలో స్టఫడ్ పరాటాలు, కుల్చా, పన్నీరు వంటకాలను భోజనంలో అందించనున్నారు. -
‘మృత్యు వేట ఎలా తప్పిందంటే..’
పుఖ్రయా: ‘భూమ్మీద ఇంకా నూకలున్నట్లున్నయి. నీ తలరాత బాగున్నట్లుంది’ అనే మాట గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఉపయోగిస్తుంటారు. ఎవరైనా చావు అంచులకు వెళ్లొచ్చినా, వెంట్రుక వాసిలో ప్రాణ ప్రమాదం నుంచి బయటపడినా ఈ మాట అంటుండటం పరిపాటి. కొంతమందికి ఎదురైన కొన్ని సంఘటనలు వింటుంటే నిజమేనట్లుంది అనిపించక మానదు కూడా. ఉత్తర ప్రదేశ్ లోని పుఖ్రయా వద్ద ఇండోర్ పట్నా ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పి 148మంది ప్రాణాలు బలిగొన్న విషయం తెలిసిందే. ఇందులో నుంచి సంతోష్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తి అదృష్టం కొద్ది ప్రాణాలతో బయటపడ్డాడు. అది కూడా ఓ ఇద్దరి వల్ల. వారితో సీటు మార్చుకున్న కారణంగా అతడు మృత్యువేట నుంచి తప్పించుకోగలిగాడు. ఆ అనుభవాన్ని ఒక్కసారి తన మాటల్లోనే వింటే.. ‘నేను కూడా ఇండోర్ పట్నా రైలులో ఎక్కాను. నా సీటు ఎస్ 2 బోగీలో ఉంది. అయితే, ఓ భార్య భర్తలకు రెండు వేర్వేరు బోగీల్లో సీట్లు లభించాయి. దీంతో వారికి ఎస్ 5 బోగీల్లో సీటు ఉందని, అందులోకి వెళ్లి కూర్చుంటే వాళ్లిద్దరు ఒకే చోట ఉండొచ్చని చెప్పారు. దీంతో మానవతా దృక్పథంతో స్పందించి అందుకు ఒప్పుకున్నాను. వారికి నా సీటు ఇచ్చి నేను వెళ్లి ఎస్ 5 బోగీలో కూర్చున్నాను. అప్పుడు సమయం రాత్రి 10.30. ఆ సమయంలో రైలు బీనా నుంచి బయలు దేరింది. సరిగ్గా మూడుగంటల ప్రాంతంలో 14 బోగీలు పట్టాలు తప్పాయి. అందులో ఎస్ 1, ఎస్ 2, ఎస్ 3, ఎస్ 4 బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. నాకు సీటు ఇచ్చిన ఆ దంపతులు చనిపోయారు. వారు ఉన్న బోగిలో ఎవరూ బ్రతికి ఉన్నారని నేను అనుకోను. నా జీవితాన్ని కాపాడిన ఆ దంపతులకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా మాటలు రావడం లేదు. చెప్పడానికి కూడా వారు లేరు’ అంటూ సంతోష్ ఉపాధ్యాయ్ కంట తడిపెట్టాడు. -
‘నా చుట్టూ శవాలు.. నేనొక్కడినే బతికిన వాడిని’
పుఖ్రయా: ‘నేను ఉన్న బోగీని సగానికి కట్ చేశారు. అందులో ఇరుక్కుపోయిన నన్ను బయటకు తీశారు. అప్పుడు నన్ను అంబులెన్స్ వద్దకు తీసుకెళుతున్నట్లు గుర్తుంది. నా చుట్టూ ఉన్న మృతదేహాల మధ్య నేను ఒక్కడిని మాత్రమే బతికినవాడిని’ అంటూ రైలు ప్రమాదానికి సంబంధించి తన భయంకరమైన అనుభవాన్ని ఉత్తమ్ కుమార్ అనే విద్యార్థి మీడియాకు వెళ్లడించాడు. ఉత్తరప్రదేశ్లోని ఫుఖ్రయా వద్ద ఇండోర్ పట్నాఎక్స్ ప్రెస్ ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. పట్టాలు తప్పిన ఆ రైలు దాదాపు 140మందిని బలగొంది. అందులో ఉత్తమ్ కుమార్ అనే 26 ఏళ్ల వ్యాపార విభాగంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థి కూడా ఉన్నాడు. ప్రమాదానికి గురైన తర్వాత నలిగిపోయిన రైలు పెట్టెలో అతడు మూడు గంటలపాటు నానా నరకం అనుభవించాడు. ఆర్తనాదాలు చేశాడు. అతడి కేకలు వినిపిస్తున్నాయి కానీ ఏమీ చేయలేని పరిస్థితి. సహాయక చర్యలు శరవేగంగానే జరుగుతున్నాయి కానీ, అతడు ఇరుక్కుపోయిన బోగీ బాగా దెబ్బ తిని త్వరగా బయటకు తీయలేని తీరుగాఉంది. ‘అక్కడ ఉన్నవారంతా నా అరుపులు వింటున్నారు.. కానీ, నేను ఉన్న రైలు పెట్టే మరో రైలు పెట్టెలో ఇరుక్కుపోయి ధ్వంసం అయి ఉండటంతో వారు ఏం చేయలేకపోయారు. అందుకే నేను గట్టిగా మా ఇంటి ఫోన్ నెంబర్ చెప్పాను. ఎవరైనా వింటే ఇంట్లో చెప్తారుగా అని. చివరకు నా అరుపులు విని కాపాడారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను’ అని చెప్పాడు. ఉత్తమ్ తలకు వెన్నుకు బలమైన దెబ్బలు తగిలాయి. మరో విషాధం ఏమిటంటే అతడి పక్కనే కూర్చున్న వాళ్ల తాత ఎక్కడ ఉన్నాడో ఏమయ్యాడో తెలియని పరిస్థితి.