‘నా చుట్టూ శవాలు.. నేనొక్కడినే బతికిన వాడిని’
పుఖ్రయా: ‘నేను ఉన్న బోగీని సగానికి కట్ చేశారు. అందులో ఇరుక్కుపోయిన నన్ను బయటకు తీశారు. అప్పుడు నన్ను అంబులెన్స్ వద్దకు తీసుకెళుతున్నట్లు గుర్తుంది. నా చుట్టూ ఉన్న మృతదేహాల మధ్య నేను ఒక్కడిని మాత్రమే బతికినవాడిని’ అంటూ రైలు ప్రమాదానికి సంబంధించి తన భయంకరమైన అనుభవాన్ని ఉత్తమ్ కుమార్ అనే విద్యార్థి మీడియాకు వెళ్లడించాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఫుఖ్రయా వద్ద ఇండోర్ పట్నాఎక్స్ ప్రెస్ ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.
పట్టాలు తప్పిన ఆ రైలు దాదాపు 140మందిని బలగొంది. అందులో ఉత్తమ్ కుమార్ అనే 26 ఏళ్ల వ్యాపార విభాగంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థి కూడా ఉన్నాడు. ప్రమాదానికి గురైన తర్వాత నలిగిపోయిన రైలు పెట్టెలో అతడు మూడు గంటలపాటు నానా నరకం అనుభవించాడు. ఆర్తనాదాలు చేశాడు. అతడి కేకలు వినిపిస్తున్నాయి కానీ ఏమీ చేయలేని పరిస్థితి. సహాయక చర్యలు శరవేగంగానే జరుగుతున్నాయి కానీ, అతడు ఇరుక్కుపోయిన బోగీ బాగా దెబ్బ తిని త్వరగా బయటకు తీయలేని తీరుగాఉంది.
‘అక్కడ ఉన్నవారంతా నా అరుపులు వింటున్నారు.. కానీ, నేను ఉన్న రైలు పెట్టే మరో రైలు పెట్టెలో ఇరుక్కుపోయి ధ్వంసం అయి ఉండటంతో వారు ఏం చేయలేకపోయారు. అందుకే నేను గట్టిగా మా ఇంటి ఫోన్ నెంబర్ చెప్పాను. ఎవరైనా వింటే ఇంట్లో చెప్తారుగా అని. చివరకు నా అరుపులు విని కాపాడారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను’ అని చెప్పాడు. ఉత్తమ్ తలకు వెన్నుకు బలమైన దెబ్బలు తగిలాయి. మరో విషాధం ఏమిటంటే అతడి పక్కనే కూర్చున్న వాళ్ల తాత ఎక్కడ ఉన్నాడో ఏమయ్యాడో తెలియని పరిస్థితి.