ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ: రైలు ప్రమాద మృతుల సంఖ్య ఇటీవల గణనీయంగా తగ్గినట్లు రైల్వే శాఖ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు 75 ప్రమాదాలు జరిగాయి. 40 మంది మృతి
చెందారు. గత ఐదేళ్లలో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువ. భద్రతా పరంగా రైల్వే శాఖ తీసుకుంటున్న చర్యల ఫలితంగానే ప్రమాదాలతో పాటు మృతుల సంఖ్య కూడా తగ్గించగలిగామని రైల్వే శాఖ
పేర్కొంటోంది.
- 2016 సెప్టెంబర్ నుంచి 2017 ఆగస్టు మధ్య 80 ప్రమాదాలు జరగ్గా 249 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. 2016 నవంబర్‌లో కాన్పూర్ దగ్గర ఇండోర్–పాట్నా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘోర ప్రమాదంలో 150 మంది చనిపోయారు.
- 2017 ఆగస్టులో ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 20 మంది చనిపోయారు. ఈ ఏడాది ఏప్రిల్ 26న ఉత్తరప్రదేశ్‌లో ఓ స్కూల్‌వ్యాన్‌ను రైలు ఢీకొట్టడంతో 13 మంది చిన్నారులు మృతి చెందారు. ఈ కాలంలో ఈ రెండే పెద్ద ప్రమాదాలని రైల్వే శాఖ తెలిపింది. గాయాలయిన వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. గత సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు మధ్య రైలు ప్రమాదాల్లో గాయపడిన వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. 272 నుంచి 12కు క్షతగాత్రుల సంఖ్య తగ్గింది.
మెరుగ్గా రైల్వే ట్రాక్ నిర్వహణ , పాత బోగీల స్థానంలో అధునాతన కోచ్‌ల ఏర్పాటు, బోగీల నిర్వాహణపై గత నాలుగేళ్లుగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్లే ప్రమాదాలు, మృతుల సంఖ్య తగ్గించగలిగామని
రైల్వే శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. పట్టాలను ఎప్పటికప్పుడు మార్చడం, భద్రతపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడం, మెరుగైన భద్రతా చర్యల కోసం ఉద్యోగులకు నిరంతర శిక్షణ,
పర్యవేక్షణ కూడా ప్రమాదాల్లో క్షతగాత్రుల సంఖ్య తగ్గడానికి కూడా కారణాలుగా చెబుతున్నారు.
కాపలాలేని క్రాసింగ్ వద్ద కూడా వాహనచోదకులు నిర్లక్ష్యంగా పట్టాలు దాటడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ ప్రమాదాల సంఖ్య కూడా ఇటీవల తగ్గిందని కూడా రైల్వే శాఖ
అధికారులు చెప్పారు. 2016–17లో 13 ప్రమాదాలు జరగ్గా గత సెప్టెంబర్ నుంచి ఆగస్టు వరకు ఎనిమిది మాత్రమే ప్రమాదాలు జరిగాయన్నారు. ఈ తరహా ప్రమాదాలను కూడా తగ్గించేందుకు పకడ్బందీ
చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.
గాంధీ జయంతి రోజు రైళ్లలో శాకాహారమే
జాతిపిత మహాత్మాగాంధీ 150 జయంతి సందర్భంగా అక్టోబర్ 2న రైళ్లలో ఐఆర్‌సీటీసీ శాకాహార భోజనమే సరఫరా చేయనుంది. ఆ రోజు ప్రత్యేక శాకాహార వంటకాలను ప్రయాణికులకు
అందజేయనున్నట్లు ఐఆర్‌సీటీసీ తెలిపింది. ప్రయాణికులు ఆ రోజు మాంసాహారాన్ని ఆర్డర్ చేసే అవకాశం లేదని పేర్కొంది. ఇది ఆ ఒక్క రోజుకు మాత్రమే పరిమితమని ఐఆర్‌సీటీసీ వర్గాలు తెలిపాయి. ఈ
మేరకు రైల్వే బోర్డు గతవారం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు అన్ని జోన్‌ల రైల్వే శాఖలు ఆ రోజు శాకాహార మెనును అమలు చేయనున్నాయి. ఈ స్పెషల్ మెనూలో స్టఫడ్ పరాటాలు, కుల్చా, పన్నీరు
వంటకాలను భోజనంలో అందించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment