న్యూఢిల్లీ: ఢిల్లీ జలవనరుల మంత్రి కపిల్ మిశ్రాను పదవి నుంచి తొలగిస్తూ కేజ్రీవాల్ ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో తలెత్తిన అంతర్గత విభేదాల్లో మిశ్రా, పార్టీ సీనియర్ నేత కుమార్ విశ్వాస్‌కు మద్దతు పలికారు. కొత్తగా ఇద్దరు ఎమ్మెల్యేలు రాజేంద్ర పాల్ గౌతమ్(సీమాపురీ), కైలాశ్ గెహ్లాట్(నజఫ్‌ఘర్)లను మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
తనను పదవి నుంచి తప్పించడంపై మిశ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు ఆప్ నాయకులు చేసిన ఓ కుంభకోణాన్ని త్వరలో బట్టబయలు చేస్తానని ప్రకటించారు. మరోవైపు వినియోగదారులకు నీటి బిల్లులు అధికంగా రావడంతోనే మిశ్రాపై చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఆయన పనితీరు సరిగ్గా లేకపోవడంవల్లే పదవి నుంచి తప్పించాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.