రోహింగ్యాలు : ఒక్కరు కూడా అడుగుపెట్టొద్దు
సాక్షి, న్యూఢిల్లీ : మయన్మార్ నుంచి రోహింగ్యా శరణార్థులు, మిలిటెంట్లు దేశంలోకి ప్రవేశించే అన్నిదారులను కేంద్ర ప్రభుత్వం మూసేస్తోంది. తాజాగా రోహింగ్యాలు దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందన్న అంతర్గత నిఘా వర్గాల సమాచారంతో కేంద్ర ప్రభుత్వం మిజోరామ్-మయన్మార్ సరిహద్దు వెంబడి భద్రతను అత్యంత కట్టుదిట్టం చేసింది. సరిహద్దులో అస్సాం రైఫిల్స్ విభాగంతో భద్రతను పెంచినట్లు హోంమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు మంగళవారం చెప్పారు.
మయన్మార్ సరిహద్దు భద్రతపై మంగళవారం కేంద్ర హోంమంత్రిత్వశాఖ పలు దఫాలుగా చర్చలు జరిపింది. ప్రధానంగా మిజోరామ్ పోలీస్, పార్లమెంటరీ ఫోర్సెస్, ఇంటెలిజెన్స్, మిజోరామ్ రాష్ట్రప్రభుత్వంతో సరిహద్దు పరిస్థితిపై రివ్యూ జరిపింది. మయన్మార్ నుంచి ఒక్క రోహింగ్యా ముస్లిం కూడా సరిహద్దు దాటి దేశంలోకి ప్రవేశించరాదని కేంద్రం ఆదేశించినట్లు ఆయన చెప్పారు. మయన్మార్‌తో మిజోరామ్‌కు మొత్తం 404 కిలోమీటర్ల సరిహద్దు ఉంది.