పొత్తు ప్రయత్నాలను చెడగొట్టద్దు
- మీడియాకు స్టాలిన్ చురక
- రసవత్తరంగా అసెంబ్లీ పోరు
- కరుణ ప్రచార పయనం
- ప్రత్యేక వాహనం సిద్ధం
ఊహా జనిత కథనాలతో పొత్తు ప్రయత్నాల్ని చెడగొట్టద్దని డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ హితవు పలికారు. ఆ పాపాన్ని తమరెందుకు మూట గట్టకుంటారంటూ మీడియాకు చురకలు అంటించారు. ఈ సారి ప్రచార పయనానికి డీఎంకే అధినేత ఎం కరుణానిధి సిద్ధమవుతున్నారు. ఇందుకోసం అన్ని హంగులతో ప్రచార రథం కోయంబత్తూరులో రూపుదిద్దుకుంటోంది.
సాక్షి, చెన్నై : రానున్న ఎన్నికల ద్వారా అధికార పగ్గాలు లక్ష్యంగా డీఎంకే పరుగులు తీస్తోంది. ఈ సారి చాన్స్ చేజారిన పక్షంలో కష్టాలు తప్పవన్న భావనతో ప్రజలతో మమేకమయ్యే దిశగా డీఎంకే వర్గాలు పరుగులు తీస్తున్నాయి. అదే సమయంలో కొన్ని పత్రికల్లో వస్తున్న కథనాలు డీఎంకేను ఇరకాటంలో పడేస్తున్నాయి. పొత్తు కసరత్తుల్లో గానీయండి, సీట్ల పందేరాల్లో గానీయండి, ఆశావహుల ఎంపికలో డీఎంకే వైఖరిని ఎత్తి చూపుతూ వస్తున్న ఈ కథనాలపై డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్‌కు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆశావహుల ఇంటర్వ్యూలు సోమవారంతో ముగియనున్న సమయంలో వస్తున్న కథనాలు, పొత్తు ప్రయత్నాలకు అడ్డంకులు సృష్టించే రీతిలో ఎదురు అవుతున్న పరిణామాల్ని
స్టాలిన్ తీవ్రంగానే పరిగణించారు.
ఆదివారం తిరుచ్చి వెళ్తూ, మీనంబాక్కం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. మీడియా సంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే క్రమంలో ప్రతినిధులకు చురకలు అంటించే ప్రయత్నాన్ని స్టాలిన్ చేశారు. ఊహా జనిత కథనాల్ని దయ చేసి కట్టి పెట్టాలని విన్నవించారు. ఈ కథనాలతో పొత్తు ప్రయత్నాలను చెడగొడుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. పొత్తు, సీట్ల పందేరాలన్నీ కొలిక్కి వచ్చాక, తామే స్వయంగా మీడియాను పిలిచి వివరిస్తామన్నారు.
అంత వరకు ఊహా జనిత కథనాలను కట్టి బెడితే మంచిదని, ఆ పాపాన్ని తమరెందుకు మూటగట్టుకుంటారంటూ చురకలు అంటించారు. అభ్యర్థుల ఇంటర్వ్యూలు సోమవారంతో ముగియనున్నాయని, తదుపరి అధినేత అభ్యర్థుల ఎంపిక కసరత్తులు చేపడుతారని, అనంతరం పొత్తు ప్రయత్నాలు, సీట్ల పందేరాలు ఉంటాయని వివరించారు. ఇక, తాము చేస్తున్న ఫిర్యాదులపై ఈసీ ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూస్తామని, లేని పక్షంలో న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. అనంతరం తిరుచ్చి చేరుకున్న స్టాలిన్‌కు పార్టీ వర్గాలు ఘన స్వాగతం పలికాయి. మహిళా విభాగం నేతృత్వంలో ఎన్నికల ప్రచార పర్యటనలపై జరిగిన సమావేశంలో స్టాలిన్ పాల్గొన్నారు. వారికి సూచనలు సలహాలు ఇచ్చారు. అనంతరం ప్రజా సంక్షేమ సిబ్బందితో సమావేశమయ్యారు. తాము అధికారంలోకి వస్తే, సమస్యలన్ని పరిష్కరించ బడుతాయని హామీ ఇచ్చారు.
కరుణ కోసం రథం : డీఎంకే అధినేత ఎం కరుణానిధి వయోభారంతో బాధ పడుతున్న విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికల్లో కొన్ని చోట్ల బహిరంగ సభల మినహా, ప్రచారంలోకి ఆయన వెళ్ల లేదు. అయితే, ఈ సారి రాష్ర్టంలో పర్యటించేందుకు కరుణానిధి సిద్ధమయ్యారు. తన పర్యటనకు వీలుగా ఉండేందుకు ప్రత్యేక ప్రచార రథాన్ని సిద్ధం చేయిస్తున్నారు. కోయంబత్తూరులో ఈ వాహనం రూపుదిద్దుకుంటోంది. వీల్ చైర్‌లో కరుణానిధి ముందుకు సాగుతున్న దృష్ట్యా, అందుకు తగ్గ ఏర్పాట్లు ఆ వాహనంలో సాగుతున్నది. హోం థియేటర్, టీవీ, విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా అమరికలు, మైక్రో ఫోన్, వైఫై, సౌకర్యాలతో పాటుగా డిజిటల్ టెక్నాలజీతో కూడిన అతి పెద్ద లౌడ్ స్పీకర్లు తదితర ఏర్పాట్లను అందులో చేస్తున్నారు. ఈ వాహనంలో కరుణానిధికి ఎలాంటి ఇబ్బందులు కల్గని రీతిలో అమరికలు జరుగుతుండడంతో, ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా కరుణానిధి పర్యటించే అవకాశం ఉండడంతో డీఎంకే శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.