గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్పేష్ ఠాకూర్ (ఫైల్‌ఫోటో)
అహ్మదాబాద్ : గుజరాత్‌లో 14 నెలల చిన్నారిపై బిహార్ వలస కార్మికుడి లైంగిక దాడి నేపథ్యంలో చెలరేగుతున్న నిరసనలు, హింసాకాండ వలస కార్మికుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. క్షత్రియ ఠాకూర్ సేన ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తుతున్న క్రమంలో గుజరాతేతరులపై ఎలాంటి దాడులకు పాల్పడటం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్పేష్ ఠాకూర్ స్పష్టం చేశారు. వలస కార్మికులపై గుజరాత్‌లో మూక దాడులకు తాము ఎన్నడూ పిలుపివ్వలేదని, గుజరాత్‌లో శాంతి కోసం కృషిచేస్తున్నామని క్షత్రియ ఠాకూర్ సేనకు నేతృత్వం వహిస్తున్న అల్పేష్ పేర్కొన్నారు.
గుజరాతేతరులు కూడా తమ సోదరులేనని, గుజరాత్‌లో శాంతియుతంగా మెలగాలని ఠాకూర్ అంతకుముందు తమ వర్గీయులకు విజ్ఞప్తి చేశారు. గుజరాతేతరులపై దాడులకు క్షత్రియ సేన ఎన్నడూ పిలుపు ఇవ్వబోదని స్పష్టం చేశారు. గత వారం సెప్టెంబర్ 28న సబర్‌కంత జిల్లాలోని హిమ్మత్‌నగర్ పట్టణ సమీపంలోని గ్రామంలో 14 నెలల పసికందుపై రవీంద్ర సాహు అనే బిహారీ వలస కార్మికుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.
బాధితురాలు ఠాకూర్ వర్గానికి చెందిన బాలిక కావడంతో క్షత్రియ సేన సభ్యులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. పుల జిల్లాల్లో బిహార్ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు, కార్మికులపై దాడులు జరిగాయి. నిందితుడు రవీంద్ర సాహును పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్‌లో ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వరాదని క్షత్రియ ఠాకూర్ సేన డిమాండ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment