
‘ఈ సమస్యను పరిష్కరించే సత్తా ఒక్క మోదీకే’
న్యూఢిల్లీ: కశ్మీర్ సమస్యను ఒక్క ప్రధాని నరేంద్రమోదీ మాత్రమే పరిష్కరించగలరని, ఆయనకు మాత్రమే సాధ్యమవుద్దని జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. శనివారం ఓ ప్లైఓవర్ ప్రారంభం సందర్భంగా మాట్లాడుతూ కశ్మీర్‌లో ఏర్పడిన అస్తవ్యస్త పరిస్థితులను, సమస్యలను ప్రస్తావించారు. వీలయినంత త్వరగా ప్రధాని జోక్యం చేసుకొని ఇందులో నుంచి బయటపడేయాలని విజ్ఞప్తి చేశారు. ‘ఇప్పుడు ఈ ఊబిలో నుంచి మనల్ని ఎవరైనా బయటపడేయగలరంటే అది ఒక్క మోదీ మాత్రమే. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దేశం మొత్తం ఆయనకు మద్దతిస్తుంది’ అని చెప్పారు.
ప్రజలు ఇచ్చిన అధికారం మోదీకి ఉంది. అదే ఆయనకున్న అత్యున్నత అధికారం. మోదీ లాహోర్ వెళ్లారు. అక్కడి ప్రధానిని కలిశారు. ఇది బలహీనతకు చిహ్నం కాదు. బలానికి, శక్తికి నిదర్శనం. ప్రధాని మోదీ కంటే ముందున్న ప్రధాని కూడా పాకిస్థాన్ వెళ్లాలనుకున్నారు. అక్కడ ఉన్న ఆయన ఇంటిని చూద్దామనుకున్నారు’ అంటూ పరోక్షంగా మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను ప్రస్తావించారు.