ఎస్పీ, బీఎస్పీ యుగళగీతం
ములాయం, మాయావతిపై మోదీ ధ్వజం
గంగా, యమున, సరస్వతి నదులతో పునీతమైన యూపీని పాలించేందుకు మాకు ఒక అవకాశమివ్వండి. అభివృద్ధి అనే కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు యూపీ.. అహంభావం, కులతత్వం, విష మతోన్మాదం, అవినీతి, బంధుప్రీతి అనే చీడలను హోమంలో త్యాగం చేయాలి. గత 50 ఏళ్లలో లేని అభివృద్ధిని ఐదేళ్లలో చేసి చూపుతాం. మా వ్యక్తిగత లాభాల కోసం మీ హక్కులకు ఏ మాత్రం భంగం కలిగించినా మమ్మల్ని తరిమేయండి. అన్ని చీడలకు అభివృద్ధే మంత్రం. దీనికి ప్రత్యామ్నాయం లేదు - అలహాబాద్ బహిరంగ సభలో ప్రధాని మోదీ
అలహాబాద్: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ కులం, మతం, బంధుప్రీతి, దౌర్జన్యాలకు ప్రాధాన్యమిస్తూ అరాచక పాలన సాగిస్తోందని ప్రధాని మోదీ మండిపడ్డారు. ఎస్పీ, బీఎస్పీ ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి వస్తూ అవినీతిలో మునిగితేలుతున్నాయని ధ్వజమెత్తారు. బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ ముగిసిశాక జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. హెలికాప్టర్లు, విమానాలు, ఆయుధాల కొనుగోళ్లలో, ఆఖరికి వంట గ్యాస్ సబ్సిడీలోనూ అవినీతికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్‌ను దుయ్యబట్టారు.
గంగా, యమున, సరస్వతి నదులతో పునీతమైన యూపీని పాలించేందుకు తమకు ఒక అవకాశమివ్వాలని ప్రజలను కోరారు. అభివృద్ధి అనే కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు యూపీ.. అహంభావం, కులతత్వం, విష మతోన్మాదం, అవినీతి, బంధుప్రీతి అనే చీడలను హోమంలో త్యాగం చేయాలన్నారు. ఈ సందర్భంగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు కేరింతలు కొట్టారు. మోదీ.. మోదీ.. మోదీ అని పదేపదే గట్టిగా అరిచారు. పరస్పరం అవినీతి నిందలు వేసుకునే బీఎస్పీ చీఫ్ మాయావతి, ఎస్పీ చీఫ్ ములాయంసింగ్ యాదవ్‌లు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోరని మండిపడ్డారు. ఇదీ వీరి యుగళగీతమని అన్నారు.
‘మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. గత 50 ఏళ్లలో లేని అభివృద్ధిని ఐదేళ్లలో చేసి చూపుతాం. మా వ్యక్తిగత లాభాల కోసం మీ హక్కులకు ఏ మాత్రం భంగం కలిగించినా మమ్మల్ని తరిమేయండి. అన్ని చీడలకు అభివృద్ధే మంత్రం. దీనికి ప్రత్యామ్నాయం లేదు’ అని మోదీ చెప్పారు. ‘యువతకు ఉద్యోగాలు వచ్చేందుకు క్లాస్-3, 4 ఉద్యోగాల్లో ఇంటర్వ్యూలను రద్దుచేసి కేంద్రం దళారీలను తొలగించింది. దీన్ని అన్ని రాష్ట్రాల్లో అనుసరించాలని చెబితే అఖిలేష్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది’ అని అన్నారు. ‘యూపీఏ హయాంలో చిన్న ఇంటిని శుభ్రం చేయడానికి ఒక వారం పట్టేది. ఇప్పుడు నేను యావద్దేశాన్ని శుభ్రం చేస్తున్నా. ఈ పనిలో దుమ్మురేగడంతో ప్రజలు మేము చేస్తున్న మంచి పనులను చూడలేకపోతున్నారు’ అని పేర్కొన్నారు.