మోదీ సర్కారుపై దాడికి మరో అస్త్రం!
న్యూఢిల్లీ: కేంద్రం నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై దాడి చేసేందుకు ప్రతిపక్షాలకు మరో అస్త్రం దొరికింది. మోదీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు భారీ స్థాయిలో ఖర్చుపెట్టినట్టు సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)తో వెల్లడైంది. ఈ కార్యక్రమ ప్రచారానికి రూ. 36 కోట్లు పైగా ఖర్చు చేసినట్టు తేలింది. ఐఏఎన్ వార్తా సంస్థ ఆర్టీఐ దరఖాస్తుతో ఈ సమాచారం రాబట్టింది.
కేంద్రంలో మోదీ సర్కారు రేండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని మే 29న ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఆరు గంటల పాటు భారీ ఎత్తున ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. దీని ప్రచార నిమిత్తం ప్రింట్ మీడియాకు రూ.35.59 కోట్లు, ఎలక్ట్రానిక్ మీడియాకు రూ. 1.06 కోట్లు ప్రభుత్వం వెచ్చించింది. దేశంలోని అన్ని ప్రధాన ఇంగ్లీషు, ప్రాంతీయ భాషల పత్రికల్లో ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది. డైరెక్టరేట్ ఆఫ్ అడ్వర్టైజింగ్, విజువల్ పబ్లిసిటీ(డీఏవీపీ) దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ సమాచారం ఇచ్చింది.