న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా రెండు క్యాబినేట్ కమిటీల ఏర్పాటుకు మోదీ ఆదేశాలు జారీచేశారు. ఈ కమిటీలు ముఖ్యంగా ఉద్యోగ కల్పన, ఆర్థిక వృద్ధి మీద దృష్టి సారించనున్నాయి. ఈ రెండు కమిటీలకు కూడా మోదీ నేతృత్వం వహించనున్నారు. దేశంలో నిరుద్యోగిత రేటు పెరగడం, జీడీపీ వృద్ది కనిష్ట స్థాయికి పడిపోవడంతోనే మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధిపై ఏర్పాటైన క్యాబినేట్ కమిటీలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, నరేంద్రసింగ్ తోమర్, రమేశ్ పోక్రియాల్, ధర్మేంద్ర ప్రధాన్, మహేంద్రనాథ్ పాండే, సంతోష్ కుమార్ గంగ్వార్, హర్‌దీప్ సింగ్ పూరిలు సభ్యులుగా ఉండనున్నారు. పెట్టుబడులు ఆర్థిక వృద్ధిపై ఏర్పాటైన క్యాబినేట్ కమిటీలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ సభ్యులుగా ఉంటారు.
కాగా, 2018-19 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి ఏకంగా అయిదేళ్ల కనిష్ట స్థాయికి తగ్గింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిరుద్యోగిత రేటు 6.1 శాతంగా నమోదైంది. ఇది 45 ఏళ్లలోనే గరిష్టస్థాయి కావడం గమనార్హం. మోదీ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఈ నివేదికలు వెలువడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment