మాండ్లా (మధ్యప్రదేశ్): అత్యాచారాలపై ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా ఆ అంశం పట్ల తమ ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని చాటి చెప్పామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ ప్రజలు తమ కుమార్తెలను గౌరవించాలని, భద్రతతో కూడిన వాతావరణం కోసం వారి కుమారుల్ని మరింత బాధ్యతాయుతంగా తీర్చిదిద్దాలని సూచించారు. మహిళలు, బాలికల భద్రతకు హామీనిచ్చేలా సామాజిక ఉద్యమానికి పిలుపునిచ్చారు.
జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని రామ్‌నగర్‌లో మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో గిరిజనులు, గ్రామ పంచాయతీ ప్రతినిధుల్ని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘ఢిల్లీలోని మా ప్రభుత్వం మీ అభిప్రాయాల్ని వినడమే కాకుండా తదనుగుణంగా నిర్ణయాలు కూడా తీసుకుంటుంది. అందుకే అత్యాచారాలకు మరణశిక్ష విధించేలా నిబంధనల్ని తెచ్చాం’ అని చెప్పారు.
అంతకుముందు మోదీ పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టం చేయడం కోసం రూపొందించిన ‘రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్’ పథకాన్ని ప్రారంభించారు. కేంద్రం అమలుచేసే ఈ పథకంలో భాగంగా స్థానిక సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడంతో పాటు.. వాటి స్వయం సమృద్ధి, ఆర్థిక స్థిరత్వానికి కృషిచేస్తారు.
జల సంరక్షణకు ఉపాధి నిధులు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల్ని వేసవికాలం మూడు నెలలు జల సంరక్షణ పనులకు వినియోగించాలని,దీంతో గ్రామాల్లో నీటి కొరతను అధిగమించడంతో పాటు, రైతులకు సహాయకారిగా ఉంటుందని మోదీ అన్నారు. ‘ప్రతీ వర్షపు చుక్కను సంరక్షించడం ద్వారా ధనాన్ని పొదుపు చేయడమే కాకుండా.. నీటికొరత నుంచి గ్రామాల్ని కాపాడవచ్చు. 2022లో మనం 75వ స్వాతంత్య్ర వేడుకల్ని జరుపుకోనే నాటికి గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని నిజం చేయాలి’ అని పిలుపునిచ్చారు.
గ్రామాల అభివృద్ధి కోసం గ్రామీణ ప్రాంత ప్రజలు జన్ ధన్, వన్ ధన్, గో ధన్ (మానవ వనరుల, అటవీ సంపద, గో సంపద)పై దృష్టిపెట్టాలని సూచించారు. పల్లెలు కేంద్రంగా అభివృద్ధి జరగాలన్న మహాత్మా గాంధీ కల సాకారం కోసం గ్రామీణ ప్రాంతా ల్లోని మానవ శక్తిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. దేశంలో వనరుల కొరత లేదని, ప్రాధమ్యాలు, అభివృద్ధి పథకాలు పారదర్శకంగా అమలు చేయడంలోనే సమస్యలున్నాయని.. వాటిని అధిగమించేందుకు ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలన్నారు.
సమర యోధుల కోసం...
గాంధీ – నెహ్రూ కుటుంబంపై పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ.. దేశ స్వాతంత్య్ర పోరాట చరిత్ర కేవలం కొద్ది మంది, కొన్ని కుటుంబాల చుట్టే తిరగడం దురదృష్టకరమని మోదీ అన్నారు. గిరిజనులు, ఇతర వర్గాల్లో గుర్తింపు పొందని స్వాతంత్య్ర పోరాట యోధుల కోసం మ్యూజియంలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
‘1857 నుంచి జరిగిన స్వాతంత్య్ర సమరంలో ప్రధాన పాత్ర పోషించిన వారికి తగిన గుర్తింపు దక్కేలా ప్రతి రాష్ట్రంలో మ్యూజియం ఏర్పాటు చేస్తాం. భావితరాలకు వారి త్యాగాలను తెలియచెప్పేందుకు ఈ మ్యూజియంలు ఉపయోగపడతాయి’ అని మోదీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment