National panchayati Raj Day
-
గ్రామాలను రక్షించుకుందాం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశం ముందు ఉన్న సవాలు గత ఏడాది ఎదురైన సవాలు కంటే పెద్దదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. కోవిడ్–19 మహమ్మారి గ్రామాలను చుట్టుముట్టకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో అర్హులందరూ కరోనా టీకా వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ శనివారం ‘స్వమిత్వ’ పథకం కింద ఈ–ప్రాపర్టీ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. 4.09 లక్షల మందికి ఈ–ప్రాపర్టీ కార్డులను అందజేశారు. ఈ వర్చువల్ కార్యక్రమంలో 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పెద్ద సంఖ్యలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే విషయంలో గ్రామ పంచాయతీలు చురుకైన పాత్ర పోషిస్తున్నాయని ప్రశంసించారు. ప్రజల్లో అవగాహన పెంచడంలో ముందుంటున్నాయని చెప్పారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు విడుదల చేసే మార్గదర్శకాలు సక్రమంగా అమలయ్యేలా చూడాల్సిన స్థానిక నాయకత్వంపై ఉందని అన్నారు. మహమ్మారిపై ప్రస్తుతం జరుగుతున్న పోరాటంలో ప్రథమ విజేత గ్రామాల నుంచే వస్తారన్న విశ్వాసం తనకు ఉందని పేర్కొన్నారు. పల్లె ప్రజలు దేశానికి, ప్రపంచానికి మార్గదర్శనం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. దవాయి భీ.. కడాయి భీ కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించే విషయంలో గత ఏడాది ఎదురైన అనుభవాలు మనకు పాఠాలు నేర్పాయని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. గత ఏడాది గ్రామాల్లోకి మహమ్మారి అడుగుపెట్టకుండా స్థానిక నేతలు పట్టుదలతో పని చేశార ని అన్నారు. ఈసారి కూడా అదే అనుభవం, పరిజ్ఞానంతో కరోనాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అందరూ అన్ని జాగ్రత్తలు పాటించడంతోపాటు కరోనా టీకా వేయించుకుంటే వైరస్ ముప్పు నుంచి తప్పించుకోవాలని చెప్పారు. దవాయి భీ, కడాయి భీ (ఔషధం, కఠినమైన నియంత్రణ చర్యలు) అనేది గ్రామ పంచాయతీల తారకమంత్రం కావాలని ప్రధానమంత్రి సూచించారు. కరోనా ప్రతికూల కాలంలో ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకుంటామని నరేంద్ర మోదీ మరోసారి హామీ ఇచ్చారు. వారికి మే, జూన్ నెలల్లో ఉచితంగా రేషన్ సరుకులు అందజేస్తామన్నారు. ఇందుకోసం రూ.26,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని, దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికిపైగా పేదలు లబ్ధి పొందుతారని తెలిపారు. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ బదిలీ కేంద్ర ప్రభుత్వ పథకాలు, విధానాలకు గ్రామాలే కేంద్ర స్థానాలని మోదీ స్పష్టం చేశారు. గ్రామాలకు రూ.2.25 లక్షల కోట్లు ఇచ్చామన్నారు. పంచాయతీలకు కొత్త హక్కులు దక్కుతున్నాయని తెలిపారు. ఫైబర్ నెట్‌తో పల్లెలను అనుసంధానం చేస్తున్నామని వివరించారు. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు సరఫరా చేసేందుకు ఉద్దేశించిన జల్ జీవన్ మిషన్ అమలులో పంచాయతీల పాత్ర కీలకమని గుర్తుచేశారు. 2021 సంవత్సరానికి గాను వివిధ కేటగిరీల కింద జాతీయ పంచాయతీ అవార్డులను ప్రధానమంత్రి అందజేశారు. రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల దాకా అవార్డు సొమ్మును గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కింద పంచాయతీల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. ఏమిటీ పథకం? సర్వే ఆఫ్ విలేజెస్, మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజీ ఏరియాస్ (స్వమిత్వ) పథకాన్ని ప్రధానమంత్రి మోదీ 2020 ఏప్రిల్ 24న ప్రారంభించారు. గ్రామాల సామాజిక, ఆర్థిక సాధికారత, స్వయం సమృద్ధే ఈ పథకం లక్ష్యం. స్వమిత్వ కింద గ్రామస్తులు తమ ఆస్తులపై రుణాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు పొందొచ్చు. 2021–2025 మధ్య దేశవ్యాప్తంగా 6.62 లక్షల గ్రామాల్లో స్వమిత్వను అమలు చేస్తారు. -
రూ.4,500 కోట్లతో మరుగుదొడ్లు నిర్మించాం
కాకినాడ/సాక్షి, అమరావతి: ఆత్మగౌరవ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా రూ.4,500 కోట్ల తో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసినట్టు సీఎం చంద్రబాబు చెప్పారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళవారం తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో జరిగిన సభలో సీఎం పాల్గొన్నారు. నూరు శాతం ఎల్ఈడీ దీపాల నిర్వహణ గల జిల్లాగా తూర్పుగోదావరిని సీఎం ప్రకటించారు. వలయంగా ఉండి నన్ను కాపాడండి! ‘కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయి. వలయంగా మారి నన్ను కాపాడండి’అని సీఎం చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పదేపదే తనపై ఏదో కుట్ర జరగబోతోందంటూ అభద్రతా భావంతో పలు వ్యాఖ్యలు చేశారు. తనకు మద్దతు తెలపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఉద్యమిస్తానని.. తనను కాపాడే బాధ్యత మాత్రం మీరే తీసుకోవాలని ప్రజలను సీఎం కోరారు. ఇన్నాళ్లూ టీడీపీతో కలిసి ఉన్న పవన్‌కల్యాణ్ ఇప్పుడు తనపైనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రమే వెనకుండి ఆడిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆర్డినెన్స్‌తో చిత్తశుద్ధి చాటుకున్నాం
మాండ్లా (మధ్యప్రదేశ్): అత్యాచారాలపై ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా ఆ అంశం పట్ల తమ ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని చాటి చెప్పామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ ప్రజలు తమ కుమార్తెలను గౌరవించాలని, భద్రతతో కూడిన వాతావరణం కోసం వారి కుమారుల్ని మరింత బాధ్యతాయుతంగా తీర్చిదిద్దాలని సూచించారు. మహిళలు, బాలికల భద్రతకు హామీనిచ్చేలా సామాజిక ఉద్యమానికి పిలుపునిచ్చారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని రామ్‌నగర్‌లో మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో గిరిజనులు, గ్రామ పంచాయతీ ప్రతినిధుల్ని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘ఢిల్లీలోని మా ప్రభుత్వం మీ అభిప్రాయాల్ని వినడమే కాకుండా తదనుగుణంగా నిర్ణయాలు కూడా తీసుకుంటుంది. అందుకే అత్యాచారాలకు మరణశిక్ష విధించేలా నిబంధనల్ని తెచ్చాం’ అని చెప్పారు. అంతకుముందు మోదీ పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టం చేయడం కోసం రూపొందించిన ‘రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్’ పథకాన్ని ప్రారంభించారు. కేంద్రం అమలుచేసే ఈ పథకంలో భాగంగా స్థానిక సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడంతో పాటు.. వాటి స్వయం సమృద్ధి, ఆర్థిక స్థిరత్వానికి కృషిచేస్తారు. జల సంరక్షణకు ఉపాధి నిధులు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల్ని వేసవికాలం మూడు నెలలు జల సంరక్షణ పనులకు వినియోగించాలని,దీంతో గ్రామాల్లో నీటి కొరతను అధిగమించడంతో పాటు, రైతులకు సహాయకారిగా ఉంటుందని మోదీ అన్నారు. ‘ప్రతీ వర్షపు చుక్కను సంరక్షించడం ద్వారా ధనాన్ని పొదుపు చేయడమే కాకుండా.. నీటికొరత నుంచి గ్రామాల్ని కాపాడవచ్చు. 2022లో మనం 75వ స్వాతంత్య్ర వేడుకల్ని జరుపుకోనే నాటికి గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని నిజం చేయాలి’ అని పిలుపునిచ్చారు. గ్రామాల అభివృద్ధి కోసం గ్రామీణ ప్రాంత ప్రజలు జన్ ధన్, వన్ ధన్, గో ధన్ (మానవ వనరుల, అటవీ సంపద, గో సంపద)పై దృష్టిపెట్టాలని సూచించారు. పల్లెలు కేంద్రంగా అభివృద్ధి జరగాలన్న మహాత్మా గాంధీ కల సాకారం కోసం గ్రామీణ ప్రాంతా ల్లోని మానవ శక్తిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. దేశంలో వనరుల కొరత లేదని, ప్రాధమ్యాలు, అభివృద్ధి పథకాలు పారదర్శకంగా అమలు చేయడంలోనే సమస్యలున్నాయని.. వాటిని అధిగమించేందుకు ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలన్నారు. సమర యోధుల కోసం... గాంధీ – నెహ్రూ కుటుంబంపై పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ.. దేశ స్వాతంత్య్ర పోరాట చరిత్ర కేవలం కొద్ది మంది, కొన్ని కుటుంబాల చుట్టే తిరగడం దురదృష్టకరమని మోదీ అన్నారు. గిరిజనులు, ఇతర వర్గాల్లో గుర్తింపు పొందని స్వాతంత్య్ర పోరాట యోధుల కోసం మ్యూజియంలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ‘1857 నుంచి జరిగిన స్వాతంత్య్ర సమరంలో ప్రధాన పాత్ర పోషించిన వారికి తగిన గుర్తింపు దక్కేలా ప్రతి రాష్ట్రంలో మ్యూజియం ఏర్పాటు చేస్తాం. భావితరాలకు వారి త్యాగాలను తెలియచెప్పేందుకు ఈ మ్యూజియంలు ఉపయోగపడతాయి’ అని మోదీ చెప్పారు. -
చౌదర్పల్లి గ్రామం
మోదీతో ముఖాముఖికి చౌదర్పల్లి సర్పంచ్ యాచారం (ఇబ్రహీంపట్నం) : రంగారెడ్డి జిల్లా చౌదర్పల్లి సర్పంచ్ గౌర నర్సింహకు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ముఖాముఖిలో పాల్గొనే అవకాశం దక్కింది. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురష్కరించుకుని ఈ నెల 24 న లక్నోలో జరగనున్న " గ్రామోదయ్ సే భారత్ ఉదయ్ తక్ " కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ హజరుకానున్నారు. లక్నోలో జరిగే కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా నుంచి యాచారం మండలం చౌదర్పల్లి సర్పంచ్ నర్సింహకు అరుదైన గౌరవం దక్కింది. ఆదివారం ఉదయం ఆయన గ్రామం నుంచి బయలుదేరనున్నారు. గ్రామంలో వంద శాతం పన్నులు వసూలు చేసినందుకు, గ్రామ వివరాలను కంప్యూటర్లో పొందుపర్చినందుకు జిల్లా పంచాయతీ శాఖ గౌర నర్సింహను ఎంపిక చేసింది. లక్నోలో జరిగే కార్యక్రమంలో సర్పంచ్ ప్రధానితో జరిగే ముఖాముఖిలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ అవకాశం దక్కడంపై సర్పంచ్ గౌర నర్సింహ మాట్లాడుతూ, అరుదైన గౌరవం దక్కడం సంతోషంగా ఉందన్నారు. ఈఓపీఆర్డీ శంకర్‌నాయక్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసుల సహకారంతోనే తనకు గుర్తింపు వచ్చిందని తెలిపారు.