న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశం ముందు ఉన్న సవాలు గత ఏడాది ఎదురైన సవాలు కంటే పెద్దదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. కోవిడ్–19 మహమ్మారి గ్రామాలను చుట్టుముట్టకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో అర్హులందరూ కరోనా టీకా వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ శనివారం ‘స్వమిత్వ’ పథకం కింద ఈ–ప్రాపర్టీ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. 4.09 లక్షల మందికి ఈ–ప్రాపర్టీ కార్డులను అందజేశారు. ఈ వర్చువల్ కార్యక్రమంలో 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పెద్ద సంఖ్యలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే విషయంలో గ్రామ పంచాయతీలు చురుకైన పాత్ర పోషిస్తున్నాయని ప్రశంసించారు. ప్రజల్లో అవగాహన పెంచడంలో ముందుంటున్నాయని చెప్పారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు విడుదల చేసే మార్గదర్శకాలు సక్రమంగా అమలయ్యేలా చూడాల్సిన స్థానిక నాయకత్వంపై ఉందని అన్నారు. మహమ్మారిపై ప్రస్తుతం జరుగుతున్న పోరాటంలో ప్రథమ విజేత గ్రామాల నుంచే వస్తారన్న విశ్వాసం తనకు ఉందని పేర్కొన్నారు. పల్లె ప్రజలు దేశానికి, ప్రపంచానికి మార్గదర్శనం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.
దవాయి భీ.. కడాయి భీ
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించే విషయంలో గత ఏడాది ఎదురైన అనుభవాలు మనకు పాఠాలు నేర్పాయని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. గత ఏడాది గ్రామాల్లోకి మహమ్మారి అడుగుపెట్టకుండా స్థానిక నేతలు పట్టుదలతో పని చేశార ని అన్నారు. ఈసారి కూడా అదే అనుభవం, పరిజ్ఞానంతో కరోనాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అందరూ అన్ని జాగ్రత్తలు పాటించడంతోపాటు కరోనా టీకా వేయించుకుంటే వైరస్ ముప్పు నుంచి తప్పించుకోవాలని చెప్పారు. దవాయి భీ, కడాయి భీ (ఔషధం, కఠినమైన నియంత్రణ చర్యలు) అనేది గ్రామ పంచాయతీల తారకమంత్రం కావాలని ప్రధానమంత్రి సూచించారు. కరోనా ప్రతికూల కాలంలో ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకుంటామని నరేంద్ర మోదీ మరోసారి హామీ ఇచ్చారు. వారికి మే, జూన్ నెలల్లో ఉచితంగా రేషన్ సరుకులు అందజేస్తామన్నారు. ఇందుకోసం రూ.26,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని, దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికిపైగా పేదలు లబ్ధి పొందుతారని తెలిపారు.
గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ బదిలీ
కేంద్ర ప్రభుత్వ పథకాలు, విధానాలకు గ్రామాలే కేంద్ర స్థానాలని మోదీ స్పష్టం చేశారు. గ్రామాలకు రూ.2.25 లక్షల కోట్లు ఇచ్చామన్నారు. పంచాయతీలకు కొత్త హక్కులు దక్కుతున్నాయని తెలిపారు. ఫైబర్ నెట్‌తో పల్లెలను అనుసంధానం చేస్తున్నామని వివరించారు. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు సరఫరా చేసేందుకు ఉద్దేశించిన జల్ జీవన్ మిషన్ అమలులో పంచాయతీల పాత్ర కీలకమని గుర్తుచేశారు. 2021 సంవత్సరానికి గాను వివిధ కేటగిరీల కింద జాతీయ పంచాయతీ అవార్డులను ప్రధానమంత్రి అందజేశారు. రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల దాకా అవార్డు సొమ్మును గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కింద పంచాయతీల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు.
ఏమిటీ పథకం?
సర్వే ఆఫ్ విలేజెస్, మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజీ ఏరియాస్ (స్వమిత్వ) పథకాన్ని ప్రధానమంత్రి మోదీ 2020 ఏప్రిల్ 24న ప్రారంభించారు. గ్రామాల సామాజిక, ఆర్థిక సాధికారత, స్వయం సమృద్ధే ఈ పథకం లక్ష్యం. స్వమిత్వ కింద గ్రామస్తులు తమ ఆస్తులపై రుణాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు పొందొచ్చు. 2021–2025 మధ్య దేశవ్యాప్తంగా 6.62 లక్షల గ్రామాల్లో స్వమిత్వను అమలు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment