ఆదివారం ఉదయం ఢాకాలోని ఢాకేశ్వరీ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ
ఢాకా నగరంలోని ప్రసిద్ధ ఢాకేశ్వరీ ఆలయ సందర్శనతో ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్లో తన రెండో రోజు పర్యటనను ప్రారంభించారు. ఆదివారం ఉదయాన్నే ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఢాకేశ్వరీ మాతకు మోదీ పూజలు నిర్వహించారు. దాదాపు 15 నిమిషాలపాటు ఆలయంలో గడిపిన ఆయనను నిర్వాహకులు శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. ఢాకా నగరానికి ఆ పేరు రావడానికి కారణం ఈ ఆలయమేనని స్థానికులు చెబుతారు.
'ఉదయాన్నే ఆలయానికి చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ శ్రీశ్రీ ఢాకేశ్వరీ ఆలయాన్ని సందర్శించారు' అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్వీట్ చేశారు. అనంతరం మోడీ.. ఢాకాలోని రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి, నిర్వాహకులతో ముచ్చటించారు. సాధువులు ఆయనకు ఆశీర్వచనాలు అందించారు.
నివారం బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో పలు కీలక చర్చలు జరిపిన మోదీ.. ఆదివారం బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చీఫ్, ప్రతిపక్ష నేత ఖలీదా జియాలతోనూ మాట్లాడతారు. పలువురు వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలతోనూ మోదీ సమావేశం కానున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మోదీ.. శనివారం ఢిల్లీ నుంచి ఢాకాకు బయలుదేరిన సంగతి తెలిసిందే.