షేక్ హసీనా-మోదీ..ఫైల్
న్యూఢిల్లీ: కోవిడ్ సంక్షోభానంతరం తొలిసారి జరిపే విదేశీ పర్యటన స్నేహపూరిత పొరుగుదేశం బంగ్లాదేశ్‌కు కావడం సంతోషకరమని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. బంగ్లా పర్యటనలో ఆదేశ ప్రధాని షేక్ హసీనాతో కీలకమైన చర్చలు జరుపుతానన్నారు. బంగ్లాదేశ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధానిమోదీ నేడు, రేపు బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన తన పర్యటనపై ఆనందం వ్యక్తం చేశారు. బంగ్లా నేషనల్‌డే వేడుకలు జరిగే శుక్రవారమే బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రహమన్ శత జయంతి ఉత్సవాలు జరగనున్నాయి.
పర్యటనలో ముజిబుర్ సమాధిని సందర్శిస్తానని ఆయన తెలిపారు. బంగ్లా పర్యటనలో 51 శక్తిపీఠాల్లో ఒకటైన జషోరేశ్వరి కాళి ఆలయాన్ని సైతం మోదీ సందర్శించి పూజలు జరపనున్నారు. బంగ్లాలోని మతువా ప్రజలతో సమావేశమయ్యేందుకు తాను ఎదురు చూస్తున్నానని మోదీ చెప్పారు. మతువాలకు ప్రధానమైన ఓర్కండాలో శ్రీహరిచంద్ ఠాకూర్ తన సందేశాన్ని ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. గతేడాది డిసెంబర్‌లో బంగ్లా ప్రధానితో వీడియో సమావేశం ఫలవంతంగా జరిగిందని, తాజా పర్యటనలో మరింత అర్ధవంతమైన చర్చలుంటాయని ఆయన తెలిపారు. బంగ్లా అధ్యక్షుడు అబ్దుల్ హమీద్‌తో పాటు ఇతర బంగ్లా నేతలతో ఆయన సమావేశం కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment