బీజేపీ ఎంపీల జాబితాలో మోడీ పేరు మిస్!
లక్నో: నిరంతరం సామాజిక మీడియా, ఇంటర్నెట్ గురించి మాట్లాడే బీజేపీ అగ్రనేతలు, ఆ పార్టీ అధికారిక వెబ్‌సైట్‌ను నవీకరించడంలో మాత్రం వెనుకబడే ఉన్నారు. దానిలోని ఎంపీల జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ పేరు లేకపోవడం దానికి మచ్చుతునక. చనిపోయిన ఎంపీలు గోపీనాథ్ ముండే, దిలీప్ సింగ్ జుదేవ్ లాంటి వారి పేర్లు ఇంకా ప్రత్యక్షమవుతున్నా.. రాజ్యసభ, లోక్‌సభ జాబితాల్లో ఎక్కడా మోడీ పేరు మాత్రం కనబడడంలేదు. ఇక బీజేపీఇన్‌లోక్‌సభ పేజీలో గత లోక్‌సభ ప్రతిపక్ష నేత, ప్రస్తుత కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ఫొటోనే ప్రదర్శితమవుతోంది. రాజ్యసభ పేజీలో కూడా ఇదే పరిస్థితి.
అప్పటి నేత అరుణ్ జైట్లీ తొలిగా మనకు దర్శనమిస్తున్నారు. ఈ రెండు పేజీలు ఆ పార్టీ అధికారిక వెబ్‌సైట్‌కు అనుసంధానంగా ఉన్నాయి. ఇక సీట్ల విషయంలో కూడా ఆ వెబ్‌సైట్ తప్పుగానే చూపిస్తోంది. లక్నో నుంచి అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ విజయం సాధించగా.. లాల్జీ టాండన్ పేరును చూపిస్తోంది. బహిష్కృత నేత జశ్వంత్ సింగ్ బార్మెర్ ఎంపీగా ప్రదర్శితమవుతోంది. వరుణ్ గాంధీ పిలిభిత్ నుంచి గెలిచినట్లు చూపిస్తున్నారు.