
ఆ ఎస్పీగారి ఆస్తి.. రూ. 152 కోట్లు!!
సాధారణంగా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల ఆస్తుల గురించే ఎక్కువగా చెప్పుకొంటూ ఉంటాం. అప్పుడప్పుడు అవినీతిపరులైన అధికారుల ఆస్తుల గురించి విని కళ్లు తేలేస్తాం. కానీ.. ఒక జిల్లా ఎస్పీ అధికారికంగానే తనకు రూ. 152 కోట్ల ఆస్తి ఉందని ప్రకటించినట్లు ఎపుడైనా విన్నారా? అవును.. పంజాబ్‌లో ఇది జరిగింది. మొహాలి సీనియర్ ఎస్పీగా చాలా కాలం నుంచి పనిచేస్తున్న గుర్‌ప్రీత్ సింగ్ భుల్లర్ తన ఆస్తి విలువ రూ. 152 కోట్లన్న విషయాన్ని ఏకంగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసే ఐపీఎస్ అధికారుల ఆదాయ రిటర్నులలో పేర్కొన్నారు. అదే రాష్ట్రంలో 2012 ఎన్నికలలో పోటీ చేసిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమకు వంద కోట్లకు పైగా ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్లలో చూపించారు. కేవల్ థిల్లాన్‌కు రూ. 137 కోట్లు, కరణ్ కౌర్ బ్రార్‌కు రూ. 128 కోట్లు ఆస్తి ఉంది. కానీ, వీళ్లిద్దరినీ తలదన్నేలా సీనియర్ ఎస్పీ ఆస్తి ఉంది.
తనకు 8 నివాస భవనాలు, నాలుగు వ్యవసాయ క్షేత్రాలు, మూడు కమర్షియల్ ప్లాట్లు ఉన్నట్లు భుల్లర్ తెలిపారు. వాటిలో ఢిల్లీలోని బారాఖంబా రోడ్డులో గల కమర్షియల్ ప్లాటు విలువ రూ. 85 లక్షలు. అలాగే ఢిల్లీలోని సైనిక్ ఫామ్స్ అనే ఖరీదైన ప్రాంతంలో 1500 చదరపు గజాల ఖాళీ స్థలం కూడా ఉంది. మొహాలీలోని బరైలీ గ్రామంలో సాగుకు పనికిరాని మరో భూమి విలువ రూ. 45 కోట్లు. వీటిలో చాలావరకు తనకు తన తాతల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులేనని భుల్లర్ చెప్పారు. 2009 నుంచి 2013 వరకు ఒకసారి, 2015 నుంచి ఇప్పటివరకు ఈయన మొహాలీ సీనియర్ ఎస్పీగా ఉన్నారు.