చండీగడ్: గత బుధవారం పంజాబ్‌లోని భటిండా సైనిక శిబిరంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో నలుగురు జవాన్లు మరణించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇది ఉగ్రవాదుల పనా? అని అనుమానాలు తలెత్తాయి.
అయితే ఈ ఘటనలో ఉగ్ర కోణం లేదని పంజాబ్ పోలీసులు సోమవారం వెల్లడించారు. దాడి చేసింది తోటి జవాన్ మోహన్ దేశాయ్ అని తెలిపారు. కాల్పుల అనంతరం అనుమానంతో అతడ్ని అరెస్టు చేసి విచారించగా నేరంగా అంగీకరించినట్లు పేర్కొన్నారు.
కాల్పుల్లో చనిపోయిన నలుగురు జవాన్లు తనను వేధించడం వల్లే దాడి చేసి హతమార్చినట్లు మోహన్ దేశాయ్ అంగీకరించినట్లు అధికారులు చెప్పారు. మొదట పోలీసులను అయోమయానికి గురి చేసేందుకు కట్టు కథలు చెప్పాడని, ఆ తర్వాత విచారణలో నిజాన్ని ఒప్పుకున్నాడని వివరించారు. ఈ ఘటనలో ఉపయోగించిన ఆయుధాలను మిలిటరీ స్టేషన్ నుంచే మోహన్ దొంగిలించాడని పేర్కొన్నారు.
మోహన్‌కు ఇంకా పెళ్లి కాలేదని ఒంటరిగానే ఉంటున్నాడని అధికారులు వెల్లడించారు. అతడ్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఈ ఘటనలో ఇతరుల ప్రమేయం ఏమైనా ఉందా? అనే విషయంపైనా దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
ఏం జరిగిందంటే?
పంజాబ్‌లోని భటిండా సైనిక శిబిరంలో శతఘ్ని దళానికి చెందిన జవాన్లు నివసించే ఆర్మీ స్టేషన్‌లోని ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఇందులో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలిలో ఇన్సాస్ రైఫిల్‌కు చెందిన 19 ఖాళీ తూటాలు లభించాయి.
ఘటన విషయం తెల్సిన వెంటనే తక్షణ స్పందన దళం రంగంలోకి దిగి ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టింది. ఎఫ్‌ఐఆర్ నమోదుచేసిన పోలీసులు, సైన్యం.. నిందితుడి కోసం వేట మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే అనుమానాస్పదంగా కన్పించిన మోహన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
చదవండి: మిలిటరీ స్టేషన్‌పై దుండగుల దాడి.. తుపాకులతో కాల్పులు.. నలుగురు సైనికులు మృతి..
Comments
Please login to add a commentAdd a comment