రేపే.. మార్స్ చెంతకు మామ్!
ఉదయం 7:17 గంటలకు అంగారకయాత్రలో తుది ఘట్టం
ఉపగ్రహంలోని ప్రధాన ఇంజన్ పరీక్ష విజయవంతం
మార్స్ ప్రభావ క్షేత్రంలోకి మామ్
బెంగళూరు: భారత అంగారక యాత్రలో తుది ఘట్టానికి సమయం ఆసన్నమైంది. మరో 24 గంటల్లోపే అంతరిక్ష రంగంలో భారత్‌కు చరిత్రాత్మక విజయం సొంతం కానుంది. సరిగ్గా రేపు(బుధవారం) ఉదయం 7:17:32 గంటలకు మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్; మంగళ్‌యాన్) ఉపగ్రహం అరుణగ్రహం చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశించేందుకు సర్వం సిద్ధమైంది. పదినెలలుగా నిద్రాణస్థితిలో ఉన్న ఉపగ్రహంలోని ప్రధాన ద్రవ అపోజీ మోటారు(లామ్) ఇంజన్‌ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సోమవారం తిరిగి మండించి విజయవంతంగా పరీక్షించింది. దీంతో అంగారక యాత్ర విజయంపై ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. మామ్‌లోని 440 న్యూటన్ లామ్ ఇంజన్‌ను సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు 4 సెకన్ల పాటు విజయవంతంగా మండించినట్లు ఇస్రో చైర్మన్ కె.రాధాకృష్ణన్ వెల్లడించారు. ఈ పరీక్షలో ఉపగ్రహ వేగాన్ని సెకనుకు 2.18 మీటర్ల చొప్పున తగ్గించామన్నారు. అంగారకుడి కక్ష్య దిశగా వెళ్లేలా ఉపగ్రహ మార్గాన్ని కూడా సవరించినట్లు తెలిపారు.
అంగారకుడి చుట్టూ 5.4 లక్షల కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న గురుత్వాకర్షణ ప్రభావ క్షేత్రంలోకి మామ్ సోమవారం ప్రవేశించిందని, ప్రస్తుతం ఉపగ్రహం పూర్తి ఆరోగ్యంగా ఉందన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం.. 24న ఉదయం అంగారకుడి చుట్టూ కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టేందుకు అంతా సిద్ధమైందన్నారు. కాగా, లామ్ ఇంజన్‌ను చివరిసారిగా గతేడాది డిసెంబరు 1న మండించారు. తర్వాత 300 రోజుల పాటు రోదసిలో నిద్రాణస్థితిలోనే ఉండటంతో దీనిని తిరిగి పనిచేయించడం అనేది అత్యంత కీలకంగా మారింది. ప్రధాన లామ్ ఇంజన్‌ను బుధవారం ఉదయం 24 నిమిషాల పాటు మండించడం ద్వారానే ఉపగ్రహ వేగాన్ని సెకనుకు 22.1 కి.మీ. నుంచి సెకనుకు 4.4 కి.మీ.లకు తగ్గించి అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. అందుకే ఇది తిరిగి పనిచేయడం అత్యవసరంగా మారింది.
ప్రత్యామ్నాయంగా.. ప్లాన్ బీ!
ఒకవేళ అంగారకుడిని సమీపించే సమయంలో ప్రధాన లామ్ ఇంజన్ పనిచేయకపోతే..? అలాంటి పరిస్థితి ఎదురైతే గనక ప్రత్యామ్నాయంగా ప్లాన్ బీని కూడా ఇస్రో సిద్ధం చేసుకుంది. లామ్ ఇంజన్ పనిచేయకపోతే.. ఉపగ్రహంలో ఉన్న ఎనిమిది థ్రస్టర్లను ఎక్కువ సేపు మండించి అయినా మామ్‌ను అరుణుడి కక్ష్యలోకి చేర్చేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. అయితే అంగారకుడి కక్ష్యను చేరే సమయంలో మామ్ భూమికి 66.6 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పైగా.. మార్స్‌కు ఆవలివైపు వెళుతుంది. ఫలితంగా 20 నిమిషాల పాటు దానికి భూమితో సంబంధాలు తెగిపోతాయి. మామూలుగా అయినా.. భూమి నుంచి మామ్‌కు ఆదేశాలు అందేందుకు 12 నిమిషాలు పడుతుంది. అందుకే.. మార్స్‌ను సమీపించగానే లామ్ ఇంజన్ మండటం మొదలయ్యేలా, అది పనిచేయని పక్షంలో థ్రస్టర్లు మండేలా శాస్త్రవేత్తలు ముందుగానే ఆదేశాలు ఇస్తున్నారు. మొత్తం మీద ప్లాన్ ఏ ప్రకారం వీలు కాకపోతే ప్లాన్ బీ ప్రకారం అయినా.. ఉపగ్రహం అంగారకుడి చుట్టూ దగ్గరగా 423 కి.మీ.(పెరిజీ), దూరంగా 80 వేల కి.మీ.(అపోజీ) ఉండే దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి చేర్చనున్నారు.
మామ్ ప్రవేశాన్ని వీక్షించేందుకు మోదీ..
అరుణగ్రహం కక్ష్యలోకి మామ్ ప్రవేశించే కీలక ఘట్టాన్ని వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం బెంగళూరులోని ఇస్రో ఉపగ్రహ నియంత్రణ కేంద్రం ‘ఇస్ట్రాక్’కు రానున్నారని సంస్థ వర్గాలు వెల్లడించాయి.
మార్స్‌ను చేరిన మావెన్.. అమెరికాకు 18వ విజయం!
మార్స్ వాతావరణం పైపొరలో నీరు, సీవోటూ ఎలా నాశనమయ్యాయన్న కోణంలో పరిశోధనలకు అమెరికా ప్రయోగించిన ‘మార్స్ అట్మాస్పియర్ అండ్ వోలెటైల్ ఎవాల్యుయేషన్(మావెన్)’ ఉపగ్రహం సోమవారం ఉదయం అంగారకుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. ఇప్పటిదాకా అంగారకుడిపైకి నాసా 24 ఉపగ్రహాలను, రోవర్లను ప్రయోగించగా.. 7 విఫలమయ్యాయి. మావెన్ ప్రయోగంతో నాసాకు ఇది 18వ అంగారక విజయం.