
పేదల నిధులు పక్కదారి
నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ నిధులు దారి మళ్లడంపై సుప్రీం విస్మయం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమానికి వినియోగించాల్సిన నిధులు పక్కదారి పట్టడంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. పేద ప్రజలకు చెందాల్సిన ఈ నిధులు మరెక్కడికో వెళ్తున్నాయని వ్యాఖ్యానించింది. నిధుల వ్యయానికి సంబంధించి రెండు వారాల్లోగా ఆడిట్ నివేదిక సమర్పించాలని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)ను ఆదేశించింది. ‘మొత్తం రూ.26 వేల కోట్లలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన మొత్తం ఎక్కడికి వెళ్లిందో మాకు తెలీదు. టీ, భోజనాలకి దీన్ని ఖర్చు చేశారేమో మీరు పరిశీలించాలి’ అని జస్టిస్ ఎమ్‌బీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) మహిందర్ సింగ్‌ని ఆదేశించింది.
‘ఇది చాలా పెద్ద మొత్తానికి సంబంధించిన వ్యవహారం. ఇది పేదలకు చెందాల్సిన డబ్బు. కానీ వారికి చేరడం లేదు. మరెక్కడికో వెళ్తోంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ డబ్బు పేద ప్రజలకు అందాలి’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా, ఆ డబ్బు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉందని, అదృశ్యం కాలేదని ఏఎస్‌జీ ధర్మాసనానికి తెలిపారు. ఇది తమను షాక్‌కు గురిచేసిందని బెంచ్ వ్యాఖ్యానించింది. ఇది రూ.26 వేల కోట్లకు సంబంధించిన వ్యవహారమని, ప్రస్తుత పరిస్థితికి కేంద్రం పరిష్కారం కనుగొనాలని సూచించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కొలిన్ గొన్సాల్వేస్ వాదనలు వినిపిస్తూ.. భారీ మొత్తం పక్కదారి పడుతోందని, అన్నింటికీ దీన్ని ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు.
నిధుల వ్యయంపై కాగ్ అధికారిని ధర్మాసనం ప్రశ్నించగా, ఆడిట్ నివేదిక సమర్పిస్తామని ఆయన బదులిచ్చారు. తదుపరి విచారణను కోర్టు మే 5కి వాయిదా వేసింది. నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి వసూలు చేస్తున్న చట్టబద్ద సెస్‌ను సక్రమంగా వినియోగించుకోవడం లేదని, లబ్ధిదారులను గుర్తించే విధానమే లేదని ఓ స్వచ్ఛంద సంస్థ కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. వసూలు చేసిన, వ్యయం చేసిన మొత్తాలకు సంబంధించి రెండు వారాల్లోగా తమకు అఫిడవిట్ దాఖలు చేయాలని హరియాణా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రభుత్వాలను కోర్టు అంతకుముందు ఆదేశించింది.