
సాక్షి,న్యూఢిల్లీ: పలు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తినా సగటు వర్షపాతం కన్నాతక్కువ నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.ఈ ఏడాది దేశవ్యాప్తంగా వర్షాలు అంచనాల కంటే తక్కువగానే నమోదయ్యాయని, మధ్య, ఈశాన్య రాష్ట్రాల్లో పంటలకు అవసరమైన మేర వర్షపాతం లేదని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం ఉంటుందని, 98 శాతం మేర వర్షాలు నమోదవుతాయని ఐఎండీ అంచనా వేయగా కేవలం 95 శాతం మేర వర్షాలు కురిశాయి. దీంతో వరుసగా నాలుగో ఏడాది వర్షపాతంపై ఐఎండీ అంచనాలు ఫలించలేదు.
పప్పు ధాన్యాలు పండే మధ్య ప్రదేశ్, వరిని విరివిగా పండించే హర్యానా, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతం నమోదవడంతో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం కన్నా తక్కువ వర్షాలు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే వరి దిగుబడి రెండు శాతం తగ్గుతుందని, సోయాబీన్ దిగుబడులు 8 శాతం తగ్గుతాయని ప్రభుత్వం పేర్కొంది. ఐఎండీ తొలిసారిగా తన అంచనాల్లో కచ్చితత్వాన్ని మెరుగుపరిచేందుకు అమెరికా అనుసరించే డైనమిక్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఈ పద్ధతి అమలైన తర్వాత ఐఎండీ అంచనాల్లో స్వల్ప వ్యత్యాసాలు మాత్రం కొనసాగుతనే ఉన్నాయి.