
సాక్షి, ముంబై : నాగ్‌పూర్‌లో ఇటీవల జరిగిన మహారాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో అనారోగ్యంతో వైద్యం పొందిన ప్రముఖుల్లో 60 మంది అతిగా మద్యం సేవించడంవల్ల వారి ఆరోగ్యం పాడైనట్లు ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. దీంతో నాయకుల క్వార్టర్స్‌లో మద్యం నిషేధం అమలులో ఉన్నప్పటికీ మంత్రులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులు మద్యం సేవిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో మహారాష్ట్రకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్షాల నాయకులు నాగ్‌పూర్‌లో తిష్ట వేస్తారు. వీరితోపాటు ముంబై, వివిధ ప్రాంతాల నుంచి సంబంధిత శాఖల ప్రభుత్వ అధికారులు, ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. అత్యవసర సమయంలో లేదా వీరు అనారోగ్యానికిగురైతే వైద్యం అందించడానికి అసెంబ్లీ ప్రాంగణం, ఎమ్మెల్యే క్వార్టర్స్, రవీ భవన్ ఇలా మూడు చోట్ల వైద్య కేంద్రాలు (క్లినిక్‌లు) అందుబాటులో ఉంచుతారు. అందుకు 48 మంది వైద్యులు విధులు నిర్వహిస్తారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో (కేవలం రెండు వారాల్లోనే) ముఖ్యమంత్రి, మంత్రులతోపాటు కార్యదర్శులు, ఎమ్మెల్యేలు ఇలా మొత్తం 7,016 మంది వివిధ వైద్య సేవలు పొందారు. అందులో 60 మంది అతిగా మద్యం సేవించడం వల్లే అనారోగ్యానికి గురైనట్టు రక్త, మూత్ర పరీక్ష నివేదికలో బయటపడింది. మంత్రులు, ఎమ్మెల్యేలు నివాసముంటున్న రవీ భవన్, ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మద్యపాణ నిషేధం అమలులో ఉంది. అయినా అక్కడికి మద్యం ఎలా వచ్చిందనేది మిస్టరీగా మారింది. సమావేశాలు ముగిసిన తరువాత వీరు బయట మద్యం సేవించారా..? లేక ఏకంగా గదిలోకే మద్యం తీసుకొచ్చారా...? అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment