రేపు పెళ్లనగా.. కూతుర్ని చంపేసిన తల్లి!
ఒక్క రోజులో పెళ్లి ఉందనగా.. కన్న కూతురి ముఖంపై దిండు పెట్టి తల్లే చంపేసింది. ఈ ఘటన ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో జరిగింది. మరొక్క రోజులో పెళ్లి ఉండటంతో షాపింగ్ పని మీద బయటకు వెళ్లి వచ్చిన తల్లికి.. తన కూతురు తమ ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తితో అభ్యంతరకరమైన పరిస్థితిలో కనిపించడంతో ఆమె ఆవేశం పట్టలేకపోయింది. అతడు ఎలాగోలా పారిపోగా.. కూతురిని ఏం చేయాలో తెలియక, చివరకు ముఖం మీద దిండు పెట్టి నొక్కి చంపేసింది. తర్వాత కొడుకుని పిలిచి, జరిగిన విషయం అంతా చెప్పింది. ఆ సమయానికి ఇంటి నిండా బోలెడంత మంది చుట్టాలు కూడా ఉన్నారు. వాళ్లతో.. కూతురికి గుండెపోటు వచ్చిందని, దాంతో ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని చెప్పింది.
తన కొడుకుతో కలిసి, కూతురి మృతదేహాన్ని లోక్‌నాయక్ ఆస్పత్రికి తీసుకెళ్లి, అక్కడి వైద్యులకు ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్లు చెప్పింది. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు బాధితురాలి తల్లిమీద, సోదరుడి మీద కేసు నమోదుచేసి వారిని అరెస్టు చేశారు. ఘజియాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తతో ఆమెకు పెళ్లి కావాల్సి ఉంది. కానీ, ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తితో ఆమెకు ఎప్పటి నుంచో సంబంధం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఆమె తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించాడు. తర్వాతి నుంచి ఆమె సోదరుడు ఓ ఫ్యాక్టరీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లితో కళకళలాడాల్సిన కుటుంబంలో ఇప్పుడు అనుకోని విషాదం చోటుచేసుకుంది. కూతురు మరణించగా, తల్లీకొడుకులు జైల్లో ఉన్నారు.