ఏలూరు టౌన్: మాతృత్వం మంటకలిసింది. కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన కన్నతల్లే కసాయిలా మారింది. అభం శుభం తెలియని 12 రోజుల పసికందును కనికరం లేకుండా నీళ్ల తొట్టిలో పడేసి హతమార్చింది. ఆపై ఏమీ తెలీదని నాటకాలాడింది. పోలీసులు తమదైన శైలీలో విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. బిడ్డను తనే నీటి తొట్టిలో పడేసినట్లు ఒప్పుకుంది.
వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రేమల్లికి చెందిన కలపాల నాగేశ్వరరావు కుమారుడు హరికృష్ణకు ఆరేళ్ల క్రితం చాట్రాయి మండలానికి చెందిన సీతామహాలక్ష్మితో వివాహమైంది. ఇద్దరూ వ్యవసాయ పనులు చేస్తుంటారు. సీతామహాలక్ష్మి ఏలూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో జూలై 30న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండడంతో డిశ్చార్జ్ చేశారు.
అయితే బిడ్డకు అనారోగ్యంగా ఉండటంతో ఈనెల 8న ఏలూరు శంకరమఠం వీధిలోని సాయి చిల్ట్రన్ హాస్పిటల్‌లో చేర్పించారు. చిన్నారికి గొంతులో ఇన్‌ఫెక్షన్ ఉండడంతో ఈఎన్‌టీ వైద్యునితో చికిత్స చేయించారు. పరిస్థితి మెరుగుపడటంతో బుధవారం డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. హాస్పిటల్‌లో సీతామహాలక్ష్మి, ఆమె తల్లి, భర్త హరికృష్ణ ఉన్నారు. హరికృష్ణ తండ్రి నాగేశ్వరరావు రేమల్లి నుంచి బస్సులో ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో దిగి కుమారుడికి ఫోన్ చేసి చెప్పగా బుధవారం మధ్యాహ్నం 3.15 గంటలకు హరికృష్ణ వెళ్లి తండ్రిని హాస్పిటల్‌కు తీసుకువచ్చాడు.
అయితే అప్పటికే పసిబిడ్డ కనిపించటంలేదని సీతామహాలక్ష్మి భర్తకు చెప్పడంతో ఆందోళనకు గురైన హరికృష్ణ, అతని తండ్రి గాలించగా హాస్పిటల్ ఆవరణలోని నీటి తొట్టిలో పసికందు మృతదేహం కనిపించింది. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వటంతో డీఎస్పీ డాక్టర్ దిలీప్‌కిరణ్ పర్యవేక్షణలో టూటౌన్ సీఐ బోనం ఆదిప్రసాద్, ఎస్‌ఐ నాగబాబు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో హరికృష్ణ తండ్రిని తీసుకురావడానికి వెళ్లిన సమయంలో తాను బాత్‌రూమ్‌కి వెళ్లానని సీతామహాలక్ష్మి చెప్పగా, ఆమె తల్లి తాను హాస్పిటల్ పైకి వెళ్లానని చెప్పారు.
అయితే, పోలీసులకు తల్లి సీతామహాలక్ష్మీపై అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారించగా, బిడ్డను తనే నీటి తొట్టిలో పడేశానని తల్లి అంగీకరించింది. దీంతో ఆమె పోలీసులు అదుపులోకి తీసుకుని కన్నబిడ్డను ఎందుకు చంపాల్సి వచ్చిందన్న విషయంపై ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment