
‘నేనెందుకు? నీ కొత్త దోస్తుతో సైకిల్‌పై వెళ్లు’
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌పై ప్రధాని నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. అఖిలేశ్ పరిపాలనలో ఏ తల్లి, ఏ కూతురు క్షేమంగా లేరని అన్నారు. గాయత్రి ప్రజాపతిలాంటి రేపిస్టులకు అఖిలేశ్ ఆశ్రయం ఇస్తుంటే మహిళలు భయపడిపోతున్నారని చెప్పారు. శనివారం జాన్‌పూర్‌లోని ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా అఖిలేశ్‌పై మాటల యుద్ధం ప్రకటించిన మోదీ.. ‘అఖిలేశ్ నన్ను ఆగ్రా లక్నో ఎక్స్‌ప్రెస్ రోడ్డు మీద ప్రయాణించమన్నాడు. అలా చేస్తే నా ఓటుకు కూడా అఖిలేశ్‌కే వేస్తానని చెప్పాడు. నేను అఖిలేశ్‌ను ఆయన కొత్త దోస్తు(రాహుల్)తో కలిసి సైకిల్‌పై జాన్‌పూర్ రోడ్లలో వెళ్లాలని కోరుతున్నాను.
కచ్చితంగా ఆయన దోస్తు కూడా అఖిలేశ్‌కు ఓటెయ్యడు’ అని మోదీ తిప్పికొట్టారు. దేశంలో భక్తులంతా గాయత్రి మంత్రం జపిస్తుంటే, ఎస్పీ ఆ పార్టీ కూటమి మాత్రం లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న గాయత్రి ప్రజాపతి పేరును తలుస్తున్నారని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చాక కూడా గాయత్రి ప్రజాపతి తన ఓటు వినియోగించుకునేందుకు వెళ్లాడని, పోలీసులు మాత్రం అతడికి కోసం చూస్తున్నారని, అఖిలేశ్ మాత్రం అతడికి అండదండలు ఇస్తున్నారని విమర్శించారు.
మార్చి 11న ఫలితాలు వచ్చిన తర్వాత దేశ ప్రజలంతా యూపీలో బీజేపీ విజయంతో హోళీ సంబురాల్లో మార్చి 13న మునిగిపోతారని చెప్పారు. విద్యుత్ అందుబాటులో లేని గ్రామాలు యూపీలో చాలా ఉన్నాయని, దేశంలో ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలు 18,000 ఉంటే అందులో 1500 గ్రామాలు యూపీవేనని మోదీ చెప్పారు.