ఎంపీ కునాల్ ఆత్మహత్యాయత్నం
- కోల్‌కతా సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న తృణమూల్ బహిష్కృత నేత
- నిద్ర మాత్రలు మింగడంతో ఆస్పత్రిలో చేర్పించిన అధికారులు
- శారదా స్కామ్ కేసులో సంచలన పరిణామం
కోల్‌కతా: శారదా చిట్‌ఫండ్స్ స్కామ్ దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన ఎంపీ కునాల్ ఘోష్ కోల్‌కతాలోని కేంద్ర కారాగారంలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. గతేడాది నవంబర్ 23న సీబీఐ ఘోష్‌ను అరెస్ట్ చేయగా, అప్పటి నుంచి ఆయన జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.
నిద్ర మాత్రలు మింగినట్లు ఘోష్ వెల్లడించగా ఆయన్ను ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రిలో చేర్పించామని పశ్చిమబెంగాల్ రాష్ట్ర జైళ్ల శాఖ మంత్రి హెచ్‌ఏ సాఫ్వి తెలిపారు. ఘోష్‌కు ఎలాంటి ప్రాణాపాయం లేదని ఆస్పత్రి డెరైక్టర్ ప్రదీప్ మిత్ర ప్రకటించారు. ఆస్పత్రికి తీసుకొచ్చిన సమయంలో ఆయన మగత స్థితిలో ఉన్నట్లు తెలిపారు. తాను 40 నిద్ర మాత్రలు మింగినట్లు చెప్పారని వెల్లడించారు. సీసీయూ విభాగంలో చేర్చిన అనంతరం ఘోష్ కడుపు భాగాన్ని శుభ్రం చేసి, నమూనాలను పరీక్షల కోసం పంపామని వివరించారు.
ముందుగా హెచ్చరించి మరీ...
శారదా చిట్స్ స్కామ్ కేసు విచారణలో భాగంగా ఘోష్‌ను ఈ నెల 10న ఇక్కడి ఓ కోర్టులో హాజరు పరిచిన సందర్భంలో... ఈ కేసులో అసలు నిందితులు బయట స్వేచ్ఛగా తిరుగుతుంటే తాను జైల్లో ఉన్నానని, నిందితులపై సీబీఐ మూడు రోజుల్లోపు తగిన చర్య తీసుకోకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని ఘోష్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అరవింద్ మిశ్రా ముందు చెప్పినట్లు ఓ జైలు అధికారి వెల్లడించారు.
ఈ హెచ్చరిక నేపథ్యంలో గత రెండు రోజుల నుంచి ఘోష్‌పై మరింత నిఘా పెట్టామని, గురువారం రాత్రి నిద్రించే ముందు కూడా అతన్ని పూర్తిగా తనిఖీ చేశామని, ఎలాంటి నిద్రమాత్రలు లభించలేదని జైలు అధికారి తెలిపారు. అయితే, శుక్రవారం వేకువజామున 2.30 గంటల సమయంలో శ్వాస ఆడటం కష్టంగా ఉందని, తాను నిద్రమాత్రలు మింగానని ఘోష్ చెప్పగా... వెంటనే వైద్యులను పిలిపించామని, వారు ఘోష్‌ను పరిశీలించి అంతా సాధారణంగానే ఉందని చెప్పినట్లు ఆ అధికారి వివరించారు. ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో ఆయన్ను ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.
ఆత్మహత్నాయత్నం చేసిన ఘోష్‌పై జైలు అధికారుల ఫిర్యాదు మేరకు హాస్టింగ్ స్టేషన్ పోలీసులు సెక్షన్ 309 కింద కేసు నమోదు చేశారు. స్వతహాగా జర్నలిస్టు అయిన ఘోష్ గతంలో శారదా గ్రూపు కంపెనీ ‘బెంగాల్ మీడియా’కు సీఈఓగా వ్యవహరించారు. ఇన్వెస్టర్లకు భారీ లాభాల ఆశ చూపించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన శారదా చిట్స్ స్కామ్ కేసులో ఘోష్‌కు కూడా పాత్ర ఉందని పేర్కొంటూ సీబీఐ గతేడాది ఆయన్ను అరెస్ట్ చేసింది. శారదా స్కామ్‌లో పలువురు తృణమూల్ కాంగ్రెస్ అగ్రనేతల ప్రమేయం ఉందని ఘోష్ గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే.
జైలు అధికారులపై చర్య: ఈ సంచలన పరిణామంతో, కోల్‌కతాలోని కేంద్ర కారాగారం సూపరింటెండెంట్, ఘటన జరిగిన సమయంలో విధుల్లో ఉన్న సిబ్బంది, జైలు డాక్టర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు సీఎం మమతా బెనర్జీ శాసనసభలో ప్రకటించారు. విచారణకు రాష్ట్ర హోం కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీని వేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఘోష్ ఆత్మహత్యాయత్నాన్ని బీజేపీ రాజకీయ కుట్రగా అభివర్ణించింది. ఈ కేసులో ఆధారాలను అణగదొక్కేందుకు ప్రయత్నం జరుగుతోందని ఆరోపించింది.