మహిళ పట్ల మంత్రి అసభ్య ప్రవర్తన
భోపాల్: ఆయన వయస్సు 85 ఏళ్లు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు మంత్రిగా చేస్తున్నారు. కానీ ఆయన ఓ మహిళను అసభ్యంగా తాకారనే వివాదం ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో పెనుదుమారం రేపుతున్నది. మధ్యప్రదేశ్ మంత్రి బాబూలాల్ గౌర్ మహిళను అసభ్యంగా తాకుతున్నట్టు కెమెరా కంటికి చిక్కింది. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండటంతో పెద్ద వివాదమే రేపుతున్నది.
అయితే మంత్రి బాబూలాల్ ఆ వీడియోలో ఏమాత్రం నిజం లేదని, తానెలాంటి తప్పు చేయలేదని చెప్తున్నారు. ఆయన గురువారం బార్‌ఖేదా నాథ్ ప్రాంతంలో బీజేపీ కార్యకర్తల బస్సును జెండా ఊపి ప్రారంభించారు. బీజేపీ కార్యకర్తలు బస్సు ఎక్కుతున్న సందర్భంగా ఆయన ఓ మహిళను వెనుకవైపు నుంచి చేయితో కొట్టడం కెమెరా కంటికి చిక్కింది. ఆయన కావాలనే మహిళను తాక్కినట్టు ఈ వీడియోలో కనిపించడం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో మధ్యప్రదేశ్ న్యూస్ చానెళ్లలోనూ ఇదే వివాదం ప్రముఖంగా ప్రసారమవుతున్నది.
అయితే ఈ వివాదంపై స్పందించిన మంత్రి బాబూలాల్ 'మహిళలు తొందరగా బస్సు ఎక్కేలా నేను ప్రోత్సహించాను. వాళ్ల కోసమే నేను ఇది చేశాను. అంతేకానీ వీడియోలో కనిపించినదానిలో నిజం లేదు' అని వివరణ ఇచ్చారు. అయితే 85 ఏళ్ల బాబూలాల్‌కు వివాదాలు కొత్త కాదు. తనదైన పంచ్ డైలాగులతో కామెంట్లు చేసి గతంలోనూ ఆయన బీజేపీని ఇరకాటంలో నెట్టారు. పదిసార్లు ఎమ్మెల్యే అయిన బాబూలాల్ మద్యం తాగడం ప్రజల మౌలిక హక్కు అని, స్టేటస్ సింబల్ అని గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.