15 రోజులు బంధించి.. ఇద్దరు అమ్మాయిలపై గ్యాంగ్ రేప్
ఖాండ్వా: అమ్మాయిలపై జరుగుతున్న ఉన్మాద ఆగడాలకు అంతూపొంతూ లేకుండాపోతోంది. మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో మరో ఘోరం చోటు చేసుకుంది. రేవా ప్రాంతానికి చెందిన ఇద్దరు అమ్మాయిలను 15 రోజుల క్రితం నిర్బంధించి పలు నగరాల్లో తిప్పుతూ గ్యాంగ్ రేప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల సమాచారం ప్రకారం ఇంట్లోంచి పారిపోయి, బస్సులో వస్తున్న ఇద్దరు అమ్మాయిలకు ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి వారిని హోషాన్బాద్కు తీసుకెళ్లాడు. అక్కడినుంచి భోపాల్, జబల్పూర్ రేవా లాంటి చోట్ల దాచిపెట్టి , తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేశారు. నాలుగు నగరాల్లో పదిహేను రోజులు ఇరవైమంది వ్యక్తులు నరకం చూపించారు. అయితే దుండగులు చివరిసారి నిర్బంధించిన ఇంటికి తాళం వేయడం మర్చిపోయిన సంగతిని గమనించిన అమ్మాయిలిద్దరూ అక్కడినుంచి తప్పించుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మాయిల సమాచారంతో జిల్లాలోని కొన్ని అనుమానిత ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. నిందితుల్లో ఒకడ్ని గుర్తించినట్టు సమాచారం. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ ఎంఎస్ సికార్వార్ తెలిపారు. అనుమానిత ప్రదేశాలకు పోలీసు టీంలను పంపించామని.. తొందర్లోనే నిందితులను పట్టుకుంటామన్నారు.