ఎత్తుకు పై ఎత్తు! | MPCC president seat given to women | Sakshi
Sakshi News home page

ఎత్తుకు పై ఎత్తు!

Published Thu, Jun 26 2014 10:15 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ఎత్తుకు పై ఎత్తు! - Sakshi

ఎత్తుకు పై ఎత్తు!

ఎంపీసీసీ అధ్యక్ష పదవిని మహిళకు అప్పగించనున్న కాంగ్రెస్?
 
సాక్షి, ముంబై: పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందన్న చందంగా తయారైంది రాష్ట్రంలో కాంగ్రెస్, ఎన్సీపీల పరిస్థితి. ముఖ్యమంత్రినిగానీ, ఎంపీసీసీ అధ్యక్షుడినిగానీ మార్చేదిలేదంటూ స్పష్టంగా చెప్పిన అధిష్టానం ఇప్పుడు ఎంపీసీసీ అధ్యక్ష పదవికి కొత్తవారిని ఎంపికచేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఇలా నిర్ణయం మార్చుకోవడం వెనక అసలు కారణంగా ఎన్సీపీ రాష్ట్రాధ్యక్షుడిని మార్చడమేనంటున్నారు.

బీసీ నేతకు రాష్ట్రాధ్యక్ష పదవిని కట్టబెట్టి ఓట్లు కొల్లగొట్టాలని ఎన్సీపీ చూస్తుండగా ఎత్తుకు పైఎత్తుగా బీసీల్లో మహిళకు ఎంపీసీసీ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. అందుకోసం రాజ్యసభ సభ్యురాలు రజనీపాటిల్ పేరును పరిశీలిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. దీంతో ప్రస్తుత ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేకు పదవీ గండం తప్పదంటున్నారు.
 
ఆరేళ్లుగా ఆ పదవిలో కొనసాగిన ఠాక్రే రికార్డే సృష్టించారు. ఆయన స్థానంలో కొత్తవారిని ఎంపిక చేయడానికి కసరత్తు జరుగుతోందని తెలియడంతో కాంగ్రెస్‌లోని మిగతా ఆశావహులు కూడా తమవంతు ప్రయత్నాలను కొనసాగిస్తున్నట్లు సమాచారం. అయితే పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మాత్రం మహిళకు ఈ పదవి కట్టబెట్టాలని చూస్తుండడంతో ఇప్పటిదాకా ఈ పదవి రేసులో ఉన్నట్లు చెప్పుకుంటున్న వ్యవసాయశాఖ మంత్రి రాధాకృష్ణ విఖేపాటిల్, సీనియర్ నాయకుడు శివాజీరావ్ మోఘే ఆశలపై నీళ్లు చల్లినట్లయిందంటున్నారు. అయితే వీరి పేర్లు కూడా అధిష్టానం పరిశీలనలో ఉన్నాయని, అవకాశాలు అప్పుడే చేజారలేదని మరో సీనియర్ నేత వెల్లడించారు.
 
లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ను మార్చాలని ఎన్సీపీ నుంచి ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు శరద్‌పవార్ నుంచి కూడా కాంగ్రెస్‌పై ఒత్తిడి పెరిగింది. అయినప్పటికీ తొలగించేది లేదంటూ కాంగ్రెస్ పృథ్వీరాజ్ చవాన్‌కు అభయమిచ్చింది. ముఖ్యమంత్రిని మేము మారిస్తే మీరు ఉపముఖ్యమంత్రిని మారుస్తారా? అని కాంగ్రెస్ ఎన్సీపీని ప్రశ్నించడంతో పవార్ వెనక్కు తగ్గినట్లు చెబుతున్నారు. అయితే పార్టీ అధ్యక్షుడిని మార్చడం ద్వారా పవార్ కాంగ్రెస్‌ను ఇరుకునబెట్టాలనేది ఎన్సీపీ వ్యూహంగా కనిపించగా కాంగ్రెస్ కూడా ధీటుగానే సమాధానం ఇచ్చేందుకు రజనీపాటిల్ పేరును తెరపైకి తెచ్చింది.
 
ఎన్సీపీలో మహిళలకు సుప్రియా సూలే నేతృత్వం వహిస్తున్నారు. కాంగ్రెస్‌లో రాష్ట్రం నుంచి మహిళలకు నేతృత్వం వహిస్తున్నవారు ఎవరూ లేకపోవడం కూడా మహిళను ఎంపిక చేయాలనే ఆలోచనకు బలం చేకూర్చిందని చెబుతున్నారు. రెండేళ్ల కిందట కూడా ఎంపీసీసీ అధ్యక్ష పదవిని మహిళకు కట్టబెట్టాలనే విషయంపై చర్చలు జరిగినా కార్యరూపం దాల్చలేదు. మరి ఇప్పుడైనా రజనీపాటిల్‌కు అప్పగిస్తారా? లేకు ఊరించి.. ఉసూరుమనిపిస్తారా చూడాలి. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement