తమిళనాడు గవర్నర్‌గా జశ్వంత్?
సాక్షి, చెన్నై : రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్యను సాగనంపేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఆయన స్థానంలో గవర్నర్‌గా బీజేపీ బహిష్కృత నేత జశ్వంత్ సింగ్‌ను నియమించనున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇందుకు అద్దం పట్టే రీతిలో మంగళవారం తమిళ పత్రికలు కథనాలతో హోరెత్తించాయి.
తమిళనాడు గవర్నర్‌గా కొణిజేటి రోశయ్య 2011 ఆగస్టులో నియమితులయ్యారు. రోశయ్య రాకతో తెలుగు వారిలో ఆనందం వెల్లి విరిసింది. రాజధాని నగరంలో తెలుగు వారు ఏర్పాటు చేసే ప్రతి కార్యక్రమంలో రోశయ్య ఆతిథ్యం ఇవ్వడం తెలుగు సంఘాల హోదాను పెంచింది.
తెలుగు వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి పరిష్కారించేందుకు ఆయన చర్యలు చేపట్టారు. ఆ దిశగా ఇక్కడి తెలుగు ప్రజల స్వప్పంగా ఉన్న ఆంధ్రా భవన్, తెలుగు అకాడమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేసినా, తెలుగు సంఘాల స్వయంకృతాపరాధంతో అది కాస్త దూరం అయ్యింది.
తెలుగు వారే కాదు...ఇతర భాషల వారు పిలిచినా పలికే రోశయ్య మరి కొద్ది రోజుల్లో గవర్నర్ బాధ్యతల నుంచి సెలవు తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇందుకు కారణం కేంద్రంలో అధికారం మారడమే. గవర్నర్ల మార్పు: కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల గవర్నర్ల మీద దృష్టి కేంద్రీ కరించే పనిలో పడట్టు సమాచారం. యూపీఏ హయంలో నియమితులైన గవర్నర్లను సాగనంపేందుకు సిద్ధం అవుతోన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ గవర్నర్ల జాబితాలో రోశయ్య కూడా ఉన్నారు. దీంతో ఆయన్ను తప్పించి కొత్త గవర్నర్ నియామకంపై కేంద్రం దృష్టి పెట్టినట్టుగా ప్రచారం సాగుతోం ది. ఇందుకు అద్దం పట్టే విధంగా మంగళవారం తమిళ పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి.
సీనియర్ నాయకుడు: బీజేపీ సీనియర్లలో జశ్వంత్ సింగ్ ఒకరు. రాజస్థాన్ బీజేపీలో కీలక నేత. వాజ్‌పేయ్ ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన ఆయన వివాదాలకు కేంద్ర బిందువు. గతంలో ఓ మారు తన పుస్తకంలో జిన్నాకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించా రు. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తన సొంత జిల్లాలో సీటు ఆశించి భంగ పడ్డారు. చివరకు పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా రెబల్ అవతారం ఎత్తారు. దీంతో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఎన్నికల ఫలితం ప్రతికూలంగా రావడంతో డీలా పడ్డ జశ్వంత్ చేసిన పొరబాటుకు పశ్చాత్తాప పడుతున్నట్టు జాతీయ స్థాయిలో ప్రచారం సాగుతోంది.
అలాగే, మళ్లీ పార్టీలోకి వెళ్లేందుకు అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్‌తో మంతనాల్లో నిమగ్నమైనట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. జశ్వంత్ సింగ్‌ను పార్టీలోకి మళ్లీ తీసుకున్న పక్షంలో ఆయనకు ఎక్కడ మంత్రి వర్గంలో చోటు కల్పించాల్సి వస్తుంద న్న విషయాన్ని బీజేపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్టు సమాచారం. గవర్నర్‌గా జశ్వంత్‌ను పంపిన పక్షంలో ఉత్తరాదికి ఆయన కాస్త దూరం పెట్టినట్లవుతుందన్న భావనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్టుగా ప్రచారం ఊపందుకుంటోంది. గవర్నర్ హోదాకు జశ్వంత్ కూడా సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. ఈ దృష్ట్యా, జశ్వంత్ సింగ్‌ను రాష్ట్ర గవర్నర్‌గా నియమించే అవకాశాలు కన్పిస్తున్నట్టుగా తమిళ పత్రికలు కోడై కూస్తుండడం గమనార్హం.