
మొఘల్ గార్డెన్స్‌లో రాష్ట్రపతి స్వాగత సత్కారం
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో ‘ఎట్ హోమ్’(స్వాగత సత్కార కార్యక్రమం) ఏర్పాటు చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మొఘల్ గార్డెన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత జాతీయ గీతాలాపన, వీవీఐపీతో పరస్పరం శుభాకాంక్షల తర్వాత.. ప్రణబ్ నిర్దేశిత మార్గం గుండా వెళ్తూ ఇతర ఆహ్వానితులకూ శుభాకాంక్షలు తెలిపారు.
భద్రతా ముప్పును దృష్టిలో ఉంచుకుని.. రాష్ట్రపతి, ప్రధాని.. ప్రజలను కలవడానికి ఈ నిర్దేశిత మార్గాలను ఏర్పాటుచేశారు. ఇంతకుముందు రాష్ట్రపతి తన భద్రతా సిబ్బందిని కొంత దూరంలో ఉంచి ప్రజలను స్వేచ్ఛగా కలిసేవారు. భద్రతా ఆంక్షల వల్ల హోలాండ్‌కు కూడా వీవీఐపీ ఎన్‌క్లోజర్‌లోనే రాష్ట్రపతి సరసన ఆసనం ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్ జైట్లీ తదితరులతో పాటు.. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, ఎల్.కె.అద్వానీ వంటి ఆ పార్టీ సీనియర్ నేతలు, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, ఆయన భార్య గుచరుశరణ్ కౌర్‌లు కూడా ఎన్‌క్లోజర్‌లోనే ఆసీనులయ్యారు. ఎయిర్ ఫోర్స్ మార్షల్ అర్జన్‌సింగ్ (96 సంవత్సరాలు) కోసం ఎన్‌క్లోజర్‌లో ప్రత్యేకంగా ఒక సీటును కేటాయించారు.
హోలాండ్‌కు మోదీ సాదర వీడ్కోలు
3 రోజుల పర్యటన ముగించుకుని మంగళవారం తిరుగు ప్రయాణమైన హోలాండ్‌కు మోదీ సాదరంగా వీడ్కోలు పలికారు. ‘భారత్‌ను సందర్శించినందుకు, గణతంత్ర దినోత్సవాలకు హాజరైనందుకు అధ్యక్షుడు హోలాండ్‌కు కృతజ్ఞతలు. ఫ్రాన్స్‌తో భారత్ స్నేహం ప్రత్యేకమైనది. హోలాండ్ పర్యటనలో చర్చలు సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయి’ అని ఆయన బయల్దేరి వెళ్లాక ట్విటర్‌లో పేర్కొన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు ట్వీట్ తెలియజేశారు. రాజ్యాంగ నిర్మాతలకు, ప్రత్యేకించిఅంబేడ్కర్‌కు నివాళులర్పించారు. సోనియా, రాహుల్ కూడా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.